ఆలోక్‌ వర్మపై వేటు

11 Jan, 2019 03:36 IST|Sakshi

ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ అసాధారణ నిర్ణయం

బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఉద్వాసన

ఆలోక్‌ వర్మపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటువేసింది. రెండు నెలల క్రితం అనూహ్యంగా బలవంతంగా సెలవుపై పంపిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సీబీఐ చీఫ్‌ పదవి నుంచే తప్పించేసింది. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత అక్టోబర్‌ 23 అర్ధరాత్రి ఆయనను సెలవుపై పంపింది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన రెండు రోజులకే ప్రభుత్వం ఆయనను అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతి బాధ్యతల నుంచి తొలగిస్తూ మరోమారు అసాధారణ నిర్ణయం తీసుకుంది. మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ 2:1 మెజారిటీతో ఆయనపై వేటువేసింది. మోదీ కక్షగట్టి ఆయనను తప్పించారని విపక్షాలతోపాటు న్యాయనిపుణులు కూడా పేర్కొన్నారు. విమర్శలకు జడవకుండా మోదీ ఆయనపై వేటు వేయడం కలకలం రేపింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో డైరెక్టర్‌స్థాయి అధికారిపై వేటు పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆలోక్‌ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్‌రావుకు బాధ్యతలు అప్పగించారు.

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మపై మరోసారి వేటుపడింది. రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆయన్ను సెలవుపై పంపగా ఈసారి ఏకంగా బాధ్యతల నుంచి తొలగిస్తూ ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ 2–1 తేడాతో నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తరఫున జస్టిస్‌ ఏకే సిక్రి,  ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత భేటీ అనంతరం వర్మను సీబీఐ నుంచి ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కేంద్రం బదిలీ చేసింది.

ఆ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్‌రావుకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలోక్‌ వర్మ, సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో రెండు నెలల క్రితం కేంద్రం వారిని సెలవుపై పంపించింది. అనంతరం కేంద్రం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆలోక్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల పదవీ కాలం ముగియకుండా సీబీఐ డైరెక్టర్‌పై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆయన్ను డైరెక్టర్‌గా కొనసాగనివ్వాలని ఆదేశించింది.  

పలు బదిలీలు చేపట్టిన వర్మ
సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ వర్మ బుధ, గురువారాల్లో పలు బదిలీలు చేపట్టారు. ముఖ్యంగా సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాపై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ డీఐజీ ఎంకే సిన్హాకు అప్పగించారు. ఆస్థానాపై వచ్చిన లంచం ఆరోపణలపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఎస్‌కే సిన్హాను 2018 అక్టోబర్‌ 23న సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర్‌రావు నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు. సిన్హాతోపాటు నాగేశ్వర్‌రావు చేపట్టిన ఇతర బదిలీలను రద్దుచేస్తూ ఆలోక్‌ ఆదేశాలిచ్చారు.  

భేటీలో ఏమయింది?
ఆలోక్‌ వర్మ భవితవ్యంపై చర్చించేందుకు ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ బుధ, గురువారాల్లో సమావేశమయింది. ఈ భేటీల్లో ప్రధాని మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తరఫున జస్టిస్‌ ఏకే సిక్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. గురువారం సాయంత్రం రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ఈ కమిటీ...  వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ అందజేసిన నివేదికను పరిశీలించింది.

దీంతో వర్మను సీబీఐ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీతోపాటు జస్టిస్‌ ఏకే సిక్రి మొగ్గు చూపగా మరో సభ్యుడు మల్లికార్జున ఖర్గే మాత్రం వ్యతిరేకించారు. శిక్షించేందుకు ముందుగా ఆలోక్‌ వర్మ వాదనను కూడా కమిటీ వినాలని ఖర్గే వాదించినట్లు అధికార వర్గాల సమాచారం. అత్యున్నత స్థాయి భేటీ అనంతరం ప్రభుత్వం.. సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ హోం గార్డ్స్‌ విభాగంలోని ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఆలోక్‌ వర్మను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

అవినీతి బయటపడుతుందనే..
రఫేల్‌ కుంభకోణం కేసును ఆలోక్‌ వర్మతో దర్యాప్తు చేయిస్తే ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో ఆరోపించారు. ‘సీబీఐ చీఫ్‌ వర్మను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని ఎందుకు తొందర పడ్డారు?, ఎంపిక కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపించకుండా వర్మను మోదీని ఎందుకు అడ్డుకున్నారు? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ‘రఫేల్‌’ అని రాహుల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

వివరణ కోరి ఉండాల్సింది
బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ స్పందిస్తూ..సీబీఐ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి వర్మను తొలగించడం ఏకపక్ష నిర్ణయమైతే అది దురదృష్టకరం. ఆయనపై మోపిన ఆరోపణలపై వివరణ కోరి ఉండాల్సింది’ అని అన్నారు. ఆలోక్‌ వర్మ తొలగింపును అధికార ఉల్లంఘనగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది మజీద్‌ మెమన్‌ అన్నారు. విశ్వసనీయత లేని సీవీసీ ఆరోపణలే ప్రాతిపదికగా వర్మను బాధ్యతల నుంచి తప్పించడం దురదృష్టకరమని లాయర్‌ అభిషేక్‌ సింఘ్వి అన్నారు.

ఖర్గే అసమ్మతి నోట్‌
ఆలోక్‌ను తొలగించాలన్న అత్యున్నత ఎంపిక కమిటీ నిర్ణయంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే అసమ్మతి నోట్‌ ఇచ్చారు. ముందుగా ఆలోక్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆయన వాదనలు కమిటీ వినాలని  ఖర్గే తెలిపినట్లు తెలిపారు. ‘సీవీసీ, సిబ్బంది శిక్షణ మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన చట్ట విరుద్ధమైన ఉత్తర్వుల ఆధారంగా కోల్పోయిన 77 రోజుల పదవీ కాలాన్ని పూర్తిగా అధికారంలో కొనసాగకుండా వర్మను పదవి నుంచి తొలగించడం అన్యాయం’ అని ఖర్గే తన నోట్‌లో పేర్కొన్నారు. 2018 అక్టోబర్‌ 23వ తేదీన జరిగిన ఘటనలపై సుప్రీంకోర్టు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. ‘సీవీసీ చేసిన పది ఆరోపణల్లో ఆరింటికి ఎలాంటి ఆధారాలు లేవు, అవి అసత్యాలు. మిగతా నాలుగు ఆరోపణలపై ఒక నిర్ధారణకు రావడానికి మరింత దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.

నాగేశ్వర్‌రావుకే మళ్లీ పగ్గాలు
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ బాధ్యతలను అడిషనల్‌ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వర్‌రావుకు కేంద్రం గురువారం అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా మరొకరిని నియమించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. వర్మ సెలవులో ఉన్నకాలంలో నాగేశ్వర్‌రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ ఉన్నారు. నాగేశ్వర్‌రావు 1986 బ్యాచ్‌ ఒరిస్సా కేడర్‌ ఐపీఎస్‌ అధికారి.

1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన వర్మ 2017 ఫిబ్రవరి ఒకటో తేదీన సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. కాగా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హా, లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌లు రఫేల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, దీనిపై కేసు నమోదు చేయాలంటూ 2018 అక్టోబర్‌ 15వ తేదీన సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్‌ వర్మకు వినతిపత్రం అందజేయడం గమనార్హం.


ఆలోక్‌ వర్మ తొలగింపు వెనక..
న్యూఢిల్లీ: 50 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఉద్వాసనకు గురైన తొలి డైరెక్టర్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆలోక్‌ వర్మ..అవినీతి, విధుల నిర్వహణలో నిర్లిప్తతతో మూల్యం చెల్లించుకున్నారు. సీబీఐ అంతర్గత సంక్షోభం దరిమిలా విచారణ జరిపిన సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) చేసిన పలు రకాల ఆరోపణలే ప్రాతిపదికగా ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వర్మపై వేటు వేసింది. వర్మను తొలగించడానికి సీవీసీ పేర్కొన్న కారణాల్ని పరిశీలిస్తే..

1. మాంస వ్యాపారి మొయిన్‌ ఖురేషి మనీ లాండరింగ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారవేత్త సతీశ్‌బాబు సానాను నిందితుడిగా చేర్చాలని సీబీఐ భావించినా, అందుకు ఆలోక్‌ వర్మ అనుమతివ్వలేదు.

2. ‘సీబీఐలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న వ్యక్తి’తో మధ్యవర్తులకు సంబంధం ఉందని రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) సేకరించిన సమాచారం ద్వారా తెలుస్తోంది.

3. గుర్గావ్‌లో సుమారు రూ.36 కోట్లు చేతులు మారిన భూమి కొనుగోలు కేసులో ఆలోక్‌ వర్మ పేరు ఉంది.

4. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న ఐఆర్‌సీటీసీ అవినీతి కేసులో ఓ అధికారిని కాపాడేందుకు ప్రయత్నించారని ఆలోక్‌ వర్మపై ఆరోపణలు వచ్చాయి.

5. అవినీతి, కళంకిత అధికారుల్ని సీబీఐలోకి తీసుకొచ్చేందుకు వర్మ ప్రయత్నించారు.

6. సీవీసీకి సహకరించడానికి నిరాకరించిన వర్మ ఉద్దేశపూర్వకంగా కీలక ఫైల్స్‌ను దాచిపెట్టారు.

7. ఎంపిక కమిటీకి నకిలీ, కల్పిత పత్రాలు సమర్పించి ఆలోక్‌ వర్మ సీబీఐ విశ్వసనీయత, సమగ్రతను దెబ్బతీశారు.

8. డైరెక్టర్, స్పెషల్‌ డైరెక్టర్‌ల మధ్య అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ట మసకబారింది.

9. కేబినెట్‌ కార్యదర్శి ఫార్వర్డ్‌ చేసిన ఫిర్యాదులోని విషయాలు చాలా వరకు నిజమని నిరూపితమయ్యాయి. ఆ ఆరోపణలు తీవ్రమైనవని, అవి సీబీఐ, దాని ఉన్నతాధికారులపై పెను ప్రభావం చూపాయి.

10. కొన్ని ఆరోపణల్లో నిజం తేలాలంటే లోతైన విచారణ చేయాలి. ఆలోక్‌ డైరెక్టర్‌గా ఉండగా నిష్పక్షపాత విచారణ జరగదు.


ఎన్నో మలుపులు..
2017, ఫిబ్రవరి 1: సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ వర్మ

2018 జులై 12: సీబీఐలో ప్రమోషన్ల సమావేశానికి తన అనుమతి లేకుండానే తన ప్రతినిధిగా ఆస్థానా హాజరుకావడంపై సీవీసీకి వర్మ లేఖ.  

ఆగస్ట్‌ 24: దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసులో నిందితులను కాపాడడానికి ఆలోక్, ఆయన సహాయకుడైన అదనపు డైరెక్టర్‌ ఎన్‌కే శర్మ  ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీ కేసులో వర్మకు
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సతీష్‌ సానా రూ.2కోట్లు  లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీవీసీ, కేబినెట్‌ సెక్రెటరీకి ఆస్థానా లేఖ.

అక్టోబర్‌ 4: ఆస్థానాకు రూ.3 కోట్లు చెల్లించినట్టు  మేజిస్ట్రేట్‌ ముందు చెప్పిన సానా.  

అక్టోబర్‌ 15: మొయిన్‌ ఖురేషీ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై ఆస్థానాపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు.

అక్టోబర్‌ 23: రాకేశ్‌ ఆస్థానా కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరో సీబీఐ అధికారి దేవేంద్రకుమార్‌కు ఏడురోజుల సీబీఐ రిమాండ్‌కు కోర్టు ఆదేశం. అక్టోబర్‌ 15న ఆస్థానాపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కుమార్‌ పేరు కూడా చేర్చారు.

అక్టోబర్‌ 24: సీవీసీ సిఫార్సుతో ఆలోక్, ఆస్థానాలను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం.  

అక్టోబర్‌ 26: వర్మపై జరుగుతున్న సీవీసీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏకే పట్నాయక్‌ను నియమించిన సుప్రీంకోర్టు.

నవంబర్‌ 12: కోర్టుకు సీవీసీ విచారణ నివేదిక.

2019, జనవరి 8: ఆలోక్‌ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా పునర్నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు.∙

జనవరి 9: బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ వర్మ. తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన బదిలీలను రద్దుచేస్తూ నిర్ణయం. వర్మ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే హైపవర్డ్‌ కమిటీలో జస్టిస్‌ ఏకే సిక్రికి చోటు కల్పించిన సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌

జనవరి 10: ఇద్దరు జాయింట్‌ డైరెక్టర్లు సహా మొత్తం ఐదుగురు అధికారులను బదిలీచేసిన వర్మ. ∙ప్రధాని మోదీ, మల్లికార్జున ఖర్గే, జస్టిస్‌ సిక్రిలతో కూడిన హైపవర్డ్‌ కమిటీ భేటీ. ఆలోక్‌ వర్మకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం.

 


ఆలోక్‌ వర్మను బదిలీ చేస్తూ కేబినెట్‌ నియామకాల కార్యదర్శి త్రిపాఠి జారీ చేసిన ఉత్తర్వులు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా శక్తి @ చంద్రయాన్‌

చంద్రుడి గుట్టు విప్పేందుకే..!

భారత సంకల్పానికి నిదర్శనం

చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే

అందరి చూపూ ఇక సెప్టెంబర్‌ 7 వైపు!

నిప్పులు చిమ్ముతూ...

చంద్రయాన్‌ -1కి చంద్రయాన్‌-2కి తేడా ఏంటి?

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్‌టీఐ సవరణ బిల్లుకు ఆమోదం

ఎంటీఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

సాధ్విని మందలించిన జేపీ నడ్డా!

‘బీజేపీ నా భర్తను వేధిస్తోంది’

మోదీ 2.0 : యాభై రోజుల పాలన ఇలా..

వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్‌

జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్‌–2

ఎన్నారై అనుమానాస్పద మృతి

ఇక పట్టాల పైకి దేశీ రైళ్లు

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

‘24 గంటల్లోనే కాంగ్రెస్‌లో చీలిక’

కైరానా ఎమ్మెల్యే ​వ్యాఖ్యలతో హైరానా..

ప్రజా ఉద్యమానికి దిగిరావాల్సిందే!

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం

మూడు నెలల్లో ఒక్క ఆడ శిశువు కూడా..

జాబిలమ్మ మీదకు చంద్రయాన్‌–2 

‘షీలా దీక్షిత్‌లానే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు’

టాయిలెట్లు శుభ్రం చేయాలా: ఎంపీ ఆగ్రహం

వెనిస్‌ వాకిట్లో బాంబే రోజ్‌

ఏకకాలంలో రెండు డిగ్రీలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ