ఆలోక్‌ వర్మ రాజీనామా

11 Jan, 2019 15:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత పోలీస్‌ సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్టు సీబీఐ చీఫ్‌ ఆలోక్‌ వర్మ శుక్రవారం ప్రకటించారు. ఫైర్‌ సర్వీసుల డైరెక్టర్‌ జనరల్‌ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన వర్మ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బదిలీ చేసిన మరుసటి రోజే సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. సీబీఐ అత్యున్నత పదవి నుంచి వర్మను ప్రభుత్వం తొలగించడం ఇది రెండవసారి కావడం గమనార్హం. సీబీఐ చీఫ్‌గా తనను తప్పించి ప్రభుత్వం అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ ఆలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం విచారణ చేపట్టి తిరిగి ఆలోక్‌కు సీబీఐ పగ్గాలు అప్పగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

కాగా, అంతకుముందు సీబీఐ చీఫ్‌గా ఆలోక్‌కు ఉద్వాసన పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ప్రధాని నివాసంలో భేటి అయిన కమిటీ ఆలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్దారించింది. దీంతో మరో 21రోజుల పదవీ కాలం ఉండగానే అయనపై  కమిటీ వేటు వేసింది.

సీబీఐ హైలెవల్‌ కమిటీ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కు బదులుగా జస్టిస్ ఏ కే సిక్రి పాల్గొన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలోక్‌ వర్మ బుధవారమే సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానాతో విభేదాల నేపథ్యం  చివరికి తీవ్ర మనస్ధాపంతో ఆలోక్‌ వర్మ రాజీనామాకు దారితీసింది.సీబీఐ చీఫ్‌గా ప్రభుత్వం తనను తప్పించడంపై న్యాయపోరాటంలో ఆలోక్‌ నెగ్గినా ప్రభుత్వం తిరిగి వేటు వేయడం ఆయనను కలిచివేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు