అదంతా ములాయం నాటకం: అమర్‌సింగ్‌

22 Feb, 2017 08:08 IST|Sakshi
అదంతా ములాయం నాటకం: అమర్‌సింగ్‌

న్యూఢిల్లీ: యావద్దేశంలో ఆసక్తి రేకెత్తించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కుటుంబ కలహమంతా నాటకమేనా? పార్టీ సమావేశాల్లో మైకు లాక్కోవడం, ఆగ్రహావేశాలు.. తర్వాత కన్నీళ్లు, ఆలింగనాలతోసద్దుమణిగిన యాదవ పరి‘వార్‌’ అంతా తూచ్‌ వ్యవహారమేనా? అవుననే అంటున్నారు ఈ గొడవలకు కారకునిగా ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ సీనియర్‌ నేత, ములాయంకు అత్యంత సన్నిహితుడూ అయిన అమర్‌సింగ్‌. ఎస్పీ అంతర్గత వివాదమంతా ములాయం సింగ్‌ యాదవ్‌ పథకం ప్రకారం ఆడించిన నాటకమేనని, కొడుకు అఖిలేశ్‌కు లబ్ధి చేకూర్చేందుకు ఈ పని చేశారని అమర్‌ బాంబు పేల్చారు.

‘ములాయం, అఖిలేశ్‌ ఒక్కటిగానే ఉన్నారు, ఉంటారు’ అని అని సీఎన్‌ ఎన్‌–న్యూస్‌ 18కు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘కొడుకు చేతిలో ఓడిపోవాలని ములాయం కోరిక. సైకిల్‌ (పార్టీ గుర్తు), కొడుకు, ఎస్పీ ఆయన బలహీనతలు.  మరైతే ఎందుకీ నాటకం? ఇదంతా పథకం ప్రకారం ఆడించిన డ్రామా. మా అందరికీ పాత్రలు దక్కాయి. మమ్మల్ని వాడుకుంటున్నట్లు తర్వాత తేలింది.. ఎస్పీతో ఉన్న అనుబంధం నా బహిష్కరణతో(పార్టీ నుంచి) తెగిపోయింది.. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత, శాంతిభద్రతల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి పన్నిన ప్రణాళిక అని తెలుసుకున్నా.. దీనికి మాస్టర్‌ స్క్రిప్ట్‌ రైటర్‌ ములాయం. కాంగ్రెస్‌తో పొత్తు ములాయంకు ఇష్టం లేకపోతే ఆయన ప్రియాంక గాంధీతో అంతసేపు ఎందుకు సమావేశం అయ్యారు?’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు