పంజాబ్‌ సీఎం కీలక నిర్ణయం

3 Jul, 2020 19:11 IST|Sakshi

చండీఘర్‌ : పంజాబ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శుక్రవారం అధికారులతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి 14 రోజుల హోం క్వారంటైన్ అనే నిబంధనను అక్కడి ప్రభుత్వం మార్చి 29 నుంచి కొనసాగిస్తుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో 14 రోజుల హోం క్వారంటైన్‌ను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు రావాలనుకునే ఇతర రాష్ట్రాల వారు దీని కోసం ఏర్పాటు చేసిన కోవా యాప్‌లో స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని పూర్తి చేయాలని చెప్పారు. దీంతో ప్రయాణ అనుమతిలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మరోవైపు కరోనా సోకిన వారిని గుర్తించేందుకు వచ్చేవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా  ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాగా పంజాబ్‌లో ఇప్పటివరకు 5,784 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 152గా ఉంది. (‘మెడికల్‌ సీట్లలో ఓబీసీ రిజర్వేషన్ల వర్తింపు’)

మరిన్ని వార్తలు