కేజ్రీవాల్‌ విద్యార్హతలపై కెప్టెన్‌ సందేహం..

4 Nov, 2018 19:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ విమర్శల దాడితో విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలో కాలుష్య తీవ్రతకు పంజాబ్‌లో పంట వ్యర్ధాలరను తగులబెట్టమే కారణమని కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను అమరీందర్‌ తప్పుపట్టారు. ఆప్‌ నేత నిజంగా ఐఐటీ గ్రాడ్యుయేట్‌యేనా అని సందేహం వ్యక్తం చేశారు.

పంజాబ్‌లో పంట వ్యర్ధాల దగ్ధానికి శాటిలైట్‌ ఫోటోలే సంకేతమని కేజ్రీవాల్‌ చెబుతున్న తీరుతో కేజ్రీవాల్‌ కంటే పాఠశాల విద్యార్ధే నయమని చురకలు వేశారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను తగులబెట్టని డిసెంబర్‌, జనవరి మాసాల్లోనూ ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకరస్ధాయిలో ఉంటోందని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సూచిస్తోందని పంజాబ్‌ సీఎం స్పష్టం చేశారు.

ఢిల్లీ కాలుష్యానికి వాహన ట్రాఫిక్‌, నిర్మాణ కార్యకలాపాలు, పారిశ్రామిక ప్రక్రియ సహా అక్కడి అంశాలే కారణమని ఈ సూచిక తేటతెల్లం చేస్తోందని వివరించారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేజ్రీవాల్‌ పొరుగు రాష్ట్రాలను తప్పుపట్టడం సరికాదని హితవు పలికారు.

మరిన్ని వార్తలు