‘తనొక క్రికెటర్‌.. కానీ నేనొక సైనికుడిని’

19 Feb, 2019 11:24 IST|Sakshi

చండీగఢ్‌ : ‘సిద్ధు ఒకనాడు క్రికెటర్‌ అయితే.. నేను ఒకనాటి సైనికుడిని. ఈ ఘటనను మేము చూసే విధానంలో, మా అభిప్రాయాల్లో భేదాలు ఉంటాయి’ పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ పంజాబ్‌ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి జాతి, మతం ఉండదన్న పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.(పుల్వామా ఉగ్రదాడి : సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు)

ఈ క్రమంలో సీఎం అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ..‘ సిద్ధు మాజీ క్రికెటర్‌. సరిహద్దుల్లో ఉండే ఇబ్బందులు తనకి అర్థం కావు. కానీ నేనో సైనికుడిని అక్కడి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిని వాడిని. అందుకే మా ఇద్దరి అభిప్రాయాల్లో తేడా కచ్చితంగా ఉంటుంది. పుల్వామా దాడికి తక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని దేశం కోరుకుంటోంది. పాకిస్తాన్‌ అండతో ఉగ్రవాదులు 41 మంది జవాన్లను బలి తీసుకున్నారు. ఇందుకు ప్రతిగా వారి 82 మంది సైనికులను చంపి బదులు తీర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. పాక్‌పై సైనిక, దౌత్య, ఆర్థికపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.(‘చాలు.. ఇక చాలు.. గుణపాఠం చెప్పాల్సిందే’)

కాగా పుల్వామా ఉగ్రదాడి గురించి స్పందిస్తూ... భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య చర్చలు జరిగినపుడు మాత్రమే ఇలాంటి ఘటనలు జరగవని, ఉగ్రవాదులు చేసిన దాడి కారణంగా ఒక జాతి మొత్తాన్ని విమర్శించడం తగదంటూ సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో వివాదానికి దారి తీసిన సిద్ధుపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా