‘రైతుల కష్టాలకు పరిష్కారం ఇదే’

5 Jun, 2019 13:23 IST|Sakshi

చండీగఢ్‌ : దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేస్తూ జాతీయ స్ధాయిలో ఈ పథకాన్ని వర్తింప చేయాలని పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రైతుల కష్టాలకు ఇది సరైన పరిష్కారమని ప్రధాని మోదీకి రాసిన లేఖలో అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పథకం రైతుల కష్టాలను పూర్తిగా పరిష్కరించలేదని గతంలో అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

తమ ప్రభుత్వం రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ రెండు లక్షల వరకూ రుణాలను మాఫీ చేసిందని, ఇప్పటికే ఐదు లక్షల మంది రైతులు తీసుకున్న రుణాల మాఫీ కోసం రూ 4468 కోట్లు సమకూర్చామని లేఖలో సింగ్‌ పేర్కొన్నారు. మిగిలిన రైతులకూ త్వరలో ఈ పథకం ద్వారా ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు. జాతీయ స్ధాయిలో రైతు రుణాల మాఫీతో పాటు ప్రధాన మంత్రి ఫసల్‌ భీమా యోజనను గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేలా అవసరమైన మార్పులు చేయాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సింగ్‌ కోరారు.

మరిన్ని వార్తలు