శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో అనూహ్య రద్దీ

3 Aug, 2019 15:39 IST|Sakshi
శ్రీనగర్‌ విమానాశ్రయం

శ్రీనగర్: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనూహ్యంగా జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ప్రతిష్టాత్మక అమర్‌నాథ్‌ యాత్రను నిలిపేసి యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్‌ లోయ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని కోరిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌ లోయలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. తీర్థయాత్రకు వచ్చిన వారు, పర్యాటకులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఒక్కసారిగా శ్రీనగర్‌ విమానాశ్రయానికి క్యూ కట్టడంతో వారికి టికెట్లు దొరకడం లేదు. భారీగా తరలి వచ్చిన యాత్రికులతో విమానాశ్రయం కిక్కిరిసింది. శ్రీనగర్ నుంచి అదనపు విమానాలను నడపడానికి విమానయాన సంస్థలు సిద్ధంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. రద్దీకి అనుగుణంగా జమ్మూకశ్మీర్‌ విమాన సర్వీసులను రీషెడ్యూల్‌ చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్టారా ప్రకటించాయి. కశ్మీర్‌ లోయలో ఎన్నడూ ఇటువంటి భయాందోళనక వాతావరణం చూడలేదని పలువురు యాత్రికులు పేర్కొన్నారు.


దాల్‌ సరస్సు వద్ద షికారా ఎక్కుతున్న పర్యాటకులు

కశ్మీర్‌ లోయలో శాంతి పెంపోందించేందుకు సహకరించాలని, పుకార్లను నమ్మవద్దని జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్  కోరారు. విద్యా సంస్థలను మూసివేయడానికి ఎలాంటి ఆదేశాలు జారీ కాకపోవడంతో యథాతథంగా కొనసాగుతున్నాయి. కశ్మీర్‌ రాష్ట్రంలో నెలకొన్న భయాందోళన పరిస్థితుల్లో  స్థానికులు నిత్యావసరాలను నిల్వ చేయడానికి స్టోర్స్, ఏటీఎంలు, ఫార్మసీలకు క్యూ కడుతున్నారు. అంతేకాక పెట్రోల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి వేచివుండాల్సి వస్తోంది.


శ్రీనగర్‌లో పెట్రోల్ బంక్‌ వద్ద ప్రజలు

మరిన్ని వార్తలు