కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన కేంద్రం

1 Jul, 2019 11:32 IST|Sakshi

కశ్మీర్‌ : జమ్ముకశ్మీర్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహను దర్శించుకునేందుకు తొలి యాత్ర ప్రారంభమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ఉదయం 5.30 గంటలకు అనంతనాగ్‌ జిల్ల అభివృద్ధి అధికారి ఖలీద్‌ జహింగీర్‌ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఆదివారం జమ్ము బేస్ క్యాంపు నుంచి బల్తాల్‌ బేస్‌ క్యాంప్‌కు బయలుదేరిన యాత్రికుల బృందం ఈరోజు యాత్రను ప్రారంభించారు. తొలి బృందంలో 2800మంది భక్తులు ఉన్నారు. 46 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈసారి దేశ వ్యాప్తంగా 1.5లక్షలకు పైగా భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు.


ఈ సారి యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేపట్టవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దాంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. యాత్రకు దాదాపు 30వేల మందికి పైగా పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. నిత్యం సీఆర్పీఎఫ్‌ సిబ్బంది సీసీ కెమెరాలు, డ్రోన్లతో దారి పొడవునా పహారా కాయనున్నట్లు అధికారులు తెలిపారు. అలానే అమర్‌నాథ్‌ బోర్డు ఈ ఏడాది నూతనంగా ‘యాత్రి నిర్వహణ వ్యవస్థ’ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రతి యాత్రికుడి మార్గాన్ని లోకేట్‌ చేసేందుకు అవకాశం కల్గుతుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు