అమ‌ర్‌నాథ్ యాత్ర : లాట‌రీ ప‌ద్ద‌తిలో భ‌క్తుల ఎంపిక‌

6 Jun, 2020 16:30 IST|Sakshi

షెడ్యూల్ విడుద‌ల‌..15 రోజుల‌కు కుదింపు

శ్రీన‌గ‌ర్ : అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు వెళ్లాల‌నుకునే భ‌క్తుల‌కు జ‌మ్ముకాశ్మీర్ ప్ర‌భుత్వం తీపిక‌బురు అందించింది. యాత్రా ప్ర‌ణాళిక‌ను సిద్దం చేసిన ప్ర‌భుత్వం కొన్ని నిబంధ‌నల్ని అమలు చేయనుంది. ప్ర‌తీ ఏడాది ల‌క్ష‌లాది మంది త‌ర‌లివ‌చ్చే ప‌విత్ర పుణ్య‌క్షేత్రాల్లో అమ‌ర్‌నాథ్ ఒక‌టి. అయితే ఈ ఏడాది క‌రోనా కార‌ణంగా యాత్ర‌కు బ్రేక్ ప‌డుతుందేమో అన్న సందేహాల న‌డుమ భ‌క్తుల‌కు శుభ‌వార్త అందించింది. అమర్‌నాథ్‌ యాత్ర జులై 21న‌ మొద‌లుకొని 15 రోజుల్లో  తీర్థ‌యాత్ర ముగియ‌నుంది.

సాధార‌ణంగా అయితే 45 రోజుల వ‌ర‌కు యాత్ర కొన‌సాగేది. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అన్ని రోజుల వ‌ర‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం ద్వారా మ‌రిన్ని ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉన్నందున ప్ర‌ణాళిక‌లో మార్పులు చేసింది. అంతేకాకుండా బాల్తాల్ మార్గంలోనే యాత్ర‌కు అనుమ‌తిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈసారి కేవలం నాలుగువేల నుంచి ఐదు వేల మంది యాత్రికుల‌కు మాత్ర‌మే అనుతించ‌నున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. వీరిని లాట‌రీ ప‌ద్ధ‌తిలో ఎంపిక చేయ‌నున్నారు. (2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం: ట్రంప్‌ )

సాధార‌ణంగా అయితే బాల్తాల్ స‌హా ప‌హ‌ల్గామ్ మార్గాల్లో అమ‌ర్‌నాథ్ యాత్ర కొన‌సాగేది. కానీ కోవిడ్ దృష్ట్యా ప‌హ‌ల్గామ్ దారిని మూసివేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.  తీర్థ‌యాత్ర స‌జావుగా సాగేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌ల‌హాదారు బ‌సీర్ అహ్మ‌ద్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అంతేకాకుండా క‌రోనా ప‌రీక్ష‌లో నెగిటివ్ వ‌చ్చిన వారిని మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని తాజా ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు. 

సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో సహజంగా ఏర్పడిన మంచు-లింగాన్ని ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ఏటా దేశ విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. ల‌క్ష‌ల‌సంఖ్య‌లో ప్ర‌తీ ఏటా జులై చివ‌రివారంలో 45 రోజుల‌పాటు తీర్థ‌యాత్ర కొన‌సాగుతుంది. అయితే గ‌త ఏడాది ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నిర్ణ‌యంతో భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల దృష్ట్యా  యాత్ర‌ను మ‌ధ్య‌లోనే నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. ఈసారి కూడా షెడ్యూల్‌లో కేవ‌లం 15 రోజుల‌కు కుదిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. (24 గంటల్లో 9887 కేసులు.. 294 మరణాలు )

మరిన్ని వార్తలు