ఈ రాష్ట్రాల్లో ‘ఈ–కామర్స్‌’కు అనుమతి

18 Apr, 2020 06:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర ‘ఈ–కామర్స్‌’సంస్థల కార్యకలాపాలకు తమ రాష్ట్రాల్లో అనుమతి ఇస్తున్నట్లు మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు, ఒడిశా ప్రకటించాయి. నిత్యావసర వస్తువులతో పాటు, అన్ని ఉత్పత్తుల అమ్మకాలకు అనుమతినిస్తున్నట్లు తెలిపాయి. అయితే, ఆయా ఉత్పత్తుల సరఫరా సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. ఈ కామర్స్‌ సంస్థలు అమ్మకాలు జరుపుకోవచ్చంటూ ఆనుమతినిచ్చిన కేంద్రం.. స్థానిక పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించింది.

ఆహారం, ఔషధాలు, సహా అన్ని నిత్యావసర, గృహావసర వస్తువుల అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు మహారాష్ట్ర పేర్కొంది. కాగా, ‘ఈ –కామర్స్‌’అమ్మకాలపై తెలంగాణ, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని సంస్థలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించడంతో లాప్‌టాప్స్, వైఫై రౌటర్స్, స్మార్ట్‌ఫోన్స్‌ తదితర వస్తువులకు భారీ డిమాండ్‌ ఏర్పడిందని ఈ –కామర్స్‌ సంస్థల ప్రతినిధులు తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే, వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తామని ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు ప్రకటించాయి.    

మరిన్ని వార్తలు