మొక్కల ’అంబులెన్స్‌’

6 Aug, 2018 21:41 IST|Sakshi

రోడ్డు ప్రమాదం జరిగినా లేదా అత్యవసర వైద్య సహాయం అవసరమైనా వెంటనే మనకు అంబులెన్స్‌ గుర్తుకు వస్తుంది. రోగిని ఆస్పత్రికి తరలించే లోపు ప్రాథమిక చికిత్సను అంబులెన్స్‌లో ఉన్న వైద్య సిబ్బంది అందిస్తారు. ఫలితంగా చాలా మంది రోగులు ప్రాణాప్రాయస్థితి నుంచి బయటపడిన సందర్భాలు ఉన్నాయి. అదే మొక్కలకు రోగం వస్తే? అత్యవసర చికిత్స అవసరమైతే?  అందుకే  ఇప్పుడు కొత్తరకం అంబులెన్స్‌ అందుబాటులోకి వచ్చింది. అదే ట్రీ అంబులెన్స్‌. మొక్కలకు అవసరమైన చికిత్సలు అందించడం, వాటిని సంరక్షించడం దీని బాధ్యత. మధ్యప్రదేశ్‌ ఛత్తర్‌పూర్‌ జిల్లాలోని బుందేల్‌ఖండ్‌ రీజియన్‌లో ఈ అంబులెన్స్‌ను ఇటీవల ప్రారంభించారు. ఢిల్లీలో ఇప్పటికే ఇలాంటి అంబులెన్స్‌ అందుబాటులో  ఉంది.

ఈ అంబులెన్స్‌లో మొక్కల నిపుణుడు, సహాయ సిబ్బంది, మొక్కలు నాటడానికి అవసరమైన పరికరాలు, నీళ్లు, ఎరువులు, క్రిమిసంహారక మందులు  అందుబాటులో ఉంటాయి. బుందేల్‌ఖండ్‌ రీజియన్‌లో పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షకు కృషి చేస్తున్న కొంతమంది వ్యక్తులు  కలిసి  సేవాలయ గ్రూప్‌గా ఏర్పడ్డారు.  ఎవరికైనా మొక్కల పెంపకంలో ఇబ్బందులు ఉంటే ఈ ట్రీ అంబులెన్స్‌ ద్వారా వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. పర్యావరణం పరిరక్షణ పచ్చదనం కోసం చాలామంది మొక్కలు నాటుతారు..’అయితే వాటిలో 60 నుంచి 70 శాతం మొక్కలు  వివిధ రకాల జబ్బుల బారిన పడుతున్నాయి.. వీటిని ఎలా సంరక్షించాలో వారికి తెలియకపోవడం వల్ల అవి చనిపోతున్నట్లుగా తాము గుర్తించామని’ గ్రూప్‌ నిర్వాహకుడొకరు తెలిపారు. ఈ ట్రీ అంబులెన్స్‌ ద్వారా అవసరమైన  సేవలను ఉచితంగానే అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో  ట్రీ అంబులెన్స్‌ను కొన్నేళ్ల క్రితమే ప్రారంభించారు. వందల ఏళ్లనాటి చెట్లను రక్షించడంతో పాటు మొక్కలకు వచ్చే జబ్బుల నివారణకు ఈ ట్రీ అంబులెన్స్‌ ద్వారా కృషి  చేస్తున్నారు.  
 
 

మరిన్ని వార్తలు