చిన్నారిని బతికించేందుకు... సీఎం కూడా!

16 Apr, 2019 18:01 IST|Sakshi

తిరువనంతపురం : మంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్లే ఓ అంబులెన్సుకు దారి ఇవ్వాలంటూ ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ఓ ఎన్జీవో చేస్తున్న కార్యక్రమానికి నెటిజన్లు అండగా నిలుస్తున్నారు. కేఎల్‌ 60 జె 7739 నంబరుల గల ఆ అంబులెన్సు ప్రయాణం సాఫీగా సాగాలంటూ లొకేషన్‌ షేర్‌ చేస్తూ దేవుడిని ప్రార్థిస్తున్నారు.  పదిహేను రోజుల వయస్సున్న ఓ పసిపాపను కాపాడేందుకు నెటిజన్లు చేస్తున్న ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా భాగస్వాములు కావడం విశేషం. అసలు విషయమేమిటంటే... కేరళలోని కసరగోడ్‌కు చెందిన సనియా, మిథా దంపతుల బిడ్డ గుండెలో లోపంతో జన్మించింది. ఈ క్రమంలో మంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఆ చిన్నారికి చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే హార్ట్‌ వాల్వ్‌ సర్జరీ నిమిత్తం తిరువనంతపురంలోని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. విమానంలో తీసుకెళ్తే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుందనే కారణంగా అంబులెన్సులో తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో పాపాయి తల్లిదండ్రులకు సహాయం చేసేందుకు చైల్డ్ ప్రొటెక్ట్‌ టీమ్‌ అనే ఎన్జీవో ముందుకు వచ్చింది. మంగళవారం నాటి ప్రయాణానికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లైవ్‌లో టెలికాస్ట్‌ చేయడం ద్వారా వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించింది. అంబులెన్సు ఎక్కడ ఉన్నది ఎన్ని నిమిషాల్లో ఏ పాయింట్‌కు చేరుతుంది తదితర విషయాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించింది. ఈ విషయం గురించి ఎన్జీవో సభ్యుడు సునీల్‌ మలిక్కల్‌ మాట్లాడుతూ... ‘ రెండేళ్ల క్రితం ఇటువంటి ఘటనే జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో సోషల్‌ మీడియాలో రూట్‌కు సంబంధించిన మెసేజ్‌ అందించడం ద్వారా అంబులెన్సు గమ్యస్థానానికి చేర్చడంలో సఫలమయ్యాం. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నాం. ఈరోజు 12 జిల్లాల గుండా దాదాపు 600 కిలోమీటర్లకు పైగా అంబులెన్సు ప్రయాణించాల్సి ఉంది. 10 నుంచి 15 గంటల్లోగా ఆస్పత్రికి చేరాల్సి ఉంటుంది. అంబులెన్సు లొకేషన్‌ షేర్‌ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో సీఎం పినరయి విజయన్‌ కూడా మాకు అండగా నిలిచారు. అంతేకాదు చిన్నారి వైద్యానికి సహాయం చేస్తామని కేరళ ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది’ అని పేర్కొన్నారు. కాగా సర్జరీ తర్వాత చిన్నారి పరిస్థితి గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి  ఉంది.

మరిన్ని వార్తలు