‘అగ్ర’జుడి ఆగమనం నేడే

24 Feb, 2020 01:50 IST|Sakshi
భార్య మెలానియాతో ట్రంప్‌

నేటి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత పర్యటన

నేరుగా అహ్మదాబాద్‌కు; అక్కడ ట్రంప్‌నకు స్వాగతం పలకనున్న ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌లో 22 కి.మీ.ల మేర రోడ్‌ షోలో పాల్గొననున్న ఇరువురు నేతలు 

అనంతరం మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం

రేపు ఢిల్లీలో ఇరుదేశాల ప్రతినిధుల స్థాయి చర్చలు

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌ : అగ్రరాజ్య అధ్యక్షుడి ఆగమనానికి సర్వం సిద్ధమైంది. అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి భారత పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. కుటుంబంతో సహా ట్రంప్‌ గుజరాత్‌లోని అహ్మదా బాద్‌లో నేటి మధ్యాహ్నం అడుగిడనున్నారు. దేశ రాజధానికి కాకుండా.. నేరుగా ఒక రాష్ట్రంలోని ప్రధాన నగరానికి అమెరికా అధ్యక్షుడు వస్తుండటం ఒక విశేషమైతే.. ప్రొటొకాల్‌కు విరుద్ధంగా దేశ రాజధానిలో కాకుండా మరో నగరానికి వెళ్లి మరీ భారత ప్రధాని ఆయనకు స్వాగతం పలుకుతుండటం మరో విశేషం.భారత పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌ వస్తున్నారు. ఆయనతో పాటు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ట్రంప్‌ కూతురు, అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్‌ కుష్నర్‌ కూడా భారత్‌ వస్తున్నారు. కీలక అంశాల్లో భారత్‌తో జరిగే చర్చల్లో పాలు పంచుకునేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఇండియా వస్తోంది. (ట్రంప్‌ దంపతుల లవ్‌ స్టోరీ)

36 గంటలు.. ముఖ్యమైన కార్యక్రమాలు
భారత్‌లో తొలుత ట్రంప్‌ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అహ్మదాబాద్‌లో రోడ్‌ షోలో పాల్గొంటారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి వారు నేరుగా ఈ రోడ్‌ షోలో పాలుపంచుకుంటారు. దాదాపు 22 కి.మీ.లు ఈ రోడ్‌ షో జరుగుతుంది. వేలాది మంది ఈ రోడ్‌ షోలో ట్రంప్‌నకు స్వాగతం పలుకుతారు. రోడ్‌ షో పొడవునా 28 వేదికలను ఏర్పాటు చేసి, భారతీయ కళారూపాలను కళాకారులు ప్రదర్శిస్తారు. అనంతరం, కొత్తగా నిర్మించిన మొతెరా క్రికెట్‌ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’కార్యక్రమం ఉంటుంది. ట్రంప్‌నకు స్వాగతం పలుకుతూ జరుగుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌ నేతృత్వంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంతో పాటు భారతీయత ఉట్టిపడే పలు ఇతర కార్యక్రమాలుంటాయి. గత సంవత్సరం మోదీ అమెరికా వెళ్లినప్పుడు.. హ్యూస్టన్‌లో అక్కడి భారతీయులు ఏర్పాటు చేసిన హౌడీ మోదీ’కార్యక్రమం తరహాలో ఈ ‘నమస్తే ట్రంప్‌’ఉంటుంది. ఆ కార్యక్రమం తరువాత ట్రంప్‌ దంపతులు ఆగ్రా వెళ్లి, ప్రఖ్యాత ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు.

ట్రంప్‌ పర్యటన సందర్భంగా ఆగ్రాను, తాజ్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడి నుంచి ట్రంప్‌ దంపతులు నేరుగా ఢిల్లీ వెళ్లి హోటల్‌ మౌర్య షెరాటన్‌లో సేద తీరుతారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడికి అధికారిక స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడికి నివాళులర్పిస్తారు. అనంతరం, హైదరాబాద్‌ హౌజ్‌లో ఇరుదేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చల్లో ప్రధాని మోదీతో కలిసి పాలుపంచుకుంటారు. ఆ తరువాత, అమెరికా అధ్యక్షుడు, తన స్నేహితుడు ట్రంప్‌ గౌరవార్ధం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ఉంటుంది. అనంతరం, యూఎస్‌ ఎంబసీలో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో ట్రంప్‌ పాల్గొంటారు. వాటిలో ప్రముఖ భారత పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక భేటీ కూడా ఉంటుంది. మంగళవారం సాయంత్రం భారత రాష్ట్రపతిని రామ్‌నాథ్‌ కోవింద్‌ను ట్రంప్‌ కలుస్తారు. అక్కడ విందు కార్యక్రమంలో పాల్గొని, అమెరికాకు పయనమవుతారు. దాదాపు 36 గంటల పాటు ట్రంప్‌ భారత్‌లో గడపనున్నారు.

ట్రంప్‌ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లో స్వాగతం పలికేందుకు చిన్నారుల చిత్రాలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌

చర్చల్లో కీలకం
ట్రంప్‌ పర్యటన భారత్, అమెరికాల ద్వైపాక్షిక సంబంధాలను మేలిమలుపు తిప్పనుంది. ముఖ్యంగా, రక్షణ, వ్యూహాత్మక సంబంధాల్లో గణనీయ స్థాయిలో సహకారం పెంపొందనుంది. అయితే, వాణిజ్య సుంకాల విషయంలో నెలకొన్న విబేధాలకు సంబంధించి నిర్ధారిత ఫలితాలేవీ రాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ, ఈ ప్రాంతంలో ఆర్థికంగా, సైనికంగా చైనా విస్తృతిని అడ్డుకునే దిశగా ఇరు దేశాల సంబంధాల మధ్య కీలక సానుకూల ఫలితాలు ఈ పర్యటన ద్వారా వెలువడే అవకాశముంది. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరుదేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఉగ్రవాదంపై పోరు, విద్యుత్, మత స్వేచ్ఛ, అఫ్గనిస్తాన్‌లో తాలిబన్‌తో ప్రతిపాదిత శాంతి ఒప్పందం, ఇండో పసిఫిక్‌ ప్రాంత పరిస్థితి.. తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని భారత్, అమెరికా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

మత స్వేచ్ఛపై కామెంట్స్‌
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)లపై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్‌ పర్యటన జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. భారత్‌లో మత స్వేచ్ఛపై ట్రంప్‌ తన అభిప్రాయాలను వెల్లడిస్తారని వైట్‌హౌజ్‌లోని ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ‘ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఇరుదేశాల విలువలైన ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛకు సంబంధించి బహిరంగంగాను, వ్యక్తిగత చర్చల్లోనూ ప్రస్తావన తీసుకువస్తారు. అన్ని అంశాలు, ముఖ్యంగా మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాన్ని ప్రెసిడెంట్‌ తప్పక లేవనెత్తుతారు’అని ఆ అధికారి తేల్చిచెప్పారు.

ఐదు ఒప్పందాలు!
ఇరు దేశాల మధ్య ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్, వాణిజ్యం, అంతర్గత భద్రతలకు సంబంధించి ఐదు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ వెల్లడించారు. ముఖ్యంగా, అమెరికా నుంచి 260 కోట్ల డాలర్లను వెచ్చించి 24 ఎంహెచ్‌–60 రోమియో హెలీకాప్టర్లను, 80 కోట్ల డాలర్లతో 6 ఏహెచ్‌ 64ఈ అపాచీ హెలీకాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందాలు కుదిరే అవకాశముంది. భారత్‌కున్న పలు అభ్యంతరాల రీత్యా.. భారత పౌల్ట్రీ, డైరీ మార్కెట్లలో ప్రవేశించాలన్న అమెరికా ఆశలు ఈ పర్యటన సందర్భంగా కుదిరే అవకాశం కనిపించడం లేదు.

ట్రంప్‌ నేటి షెడ్యూల్‌..
ఉదయం..

11:40.. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ 
వల్లభాయ్‌ అంతర్జాతీయ 
విమానాశ్రయానికి చేరుకోనున్న ట్రంప్‌

మధ్యాహ్నం 
12:15.. ట్రంప్, మోదీలు కలసి 
సబర్మతీ ఆశ్రమానికి చేరుకుంటారు
01:05.. మొతెరా స్టేడియంలో 
నమస్తే ట్రంప్‌ కార్యక్రమం
03:30.. ఆగ్రాకు ప్రయాణం

సాయంత్రం 
04:45.. ఆగ్రాకు చేరుకుంటారు
05:15.. తాజ్‌మహల్‌ సందర్శన
06:45.. ఢిల్లీకి ప్రయాణం
07:30.. ఢిల్లీకి చేరుకుంటారు

మరిన్ని వార్తలు