అతడి శవం దొరికే అవకాశమే లేదా?!

24 Nov, 2018 20:50 IST|Sakshi

అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో నివసించే సెంటినెలీస్‌ తెగ ప్రజల చేతికి చిక్కిన ఎవరైనా సరే శవంగా మారిన తర్వాత కూడా సొంత వాళ్లను చేరే అవకాశం లేదని ఆ ప్రాంతాన్ని సందర్శించి బయటపడ్డ సాహస యాత్రికులు చెబుతున్నారు. సెంటినలీస్‌ల చేతిలో జాన్‌ అలెన్‌ చౌ అనే అమెరికన్‌ టూరిస్టు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి మృతదేహం ఎక్కడుందో తెలిసినా వెలికితీసే అవకాశం లేదని సెంటినెలీస్‌ల గురించి పూర్తిగా అధ్యయనం చేసినవారు హెచ్చరిస్తున్నారు. గతంలో ఆ ప్రదేశానికి వెళ్లిన జాలర్లు మృత్యువాత పడ్డారని, వారి శవాలను తీసుకువచ్చేందుకు బయల్దేరిన అధికారులకు కూడా చేదు అనుభవాలు ఎదురైన విషయాన్ని గుర్తు చేశారు. ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా సరే అలెన్‌ అవశేషాలు ఇక దొరకవనే కఠిన వాస్తవాన్ని అతడి కుటుంబ సభ్యులు అంగీకరించక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోసారి కల్లోలం చెలరేగే అవకాశం ఉంది
‘నాకు తెలిసి ఇది అంత మంచి ఆలోచన కాదు. అలెన్‌ మృతదేహాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో సెంటినెలీస్‌ తెగ ప్రజల్లో మరోమారు అలజడి రేగే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. అధికారులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న వాళ్లను మరోసారి ఇబ్బంది పెడితే అధికారులతో పాటు ఆ తెగ ప్రజలను ప్రమాదంలో పడేసినట్లే అవుతుంది’  గిరిజన హక్కుల నేత,‘ అండమాన్‌ అండ్‌ నికోబర్‌ ఐలాండ్స్‌’ రచయిత పంకజ్‌ సెఖ్సారియా అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్‌ అనూప్‌ కపూర్‌ మాట్లాడుతూ.. సెంటినెలీస్‌ ప్రజలు తమ లాంటి ఆహార్యం(ఒంటిపై దుస్తులు లేకుండా) కలిగి ఉన్న వ్యక్తులకు హాని చేయరని అందుకు తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. కాబట్టి వాళ్లలో ఒకరిలా కలిసిపోతే అలెన్‌ మృతదేహాన్ని బయటికి తీసుకురావడం అంత కష్టమేమీ కాకపోవచ్చని వ్యాఖ్యానించారు.

నిర్ణీత గడువంటూ ఏమీ లేదు..
‘మేము సెంటినలీస్‌ల భద్రత గురించి కూడా ఆలోచించాలి. గతంలో ఇలాంటి చర్యల వల్ల వాళ్లు అనారోగ్యం పాలయ్యారు. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. అలెన్‌ మృతదేహాన్ని వెలికితీసేందుకు నిర్ణీత గడువునైతే విధించలేదు’ అని అండమాన్‌ పోలీస్‌ దీపేంద్ర పాఠక్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు