జై.. ఆచూకీ చెప్తే 50,000 బహుమతి!

29 Jul, 2016 20:01 IST|Sakshi
జై.. ఆచూకీ చెప్తే 50,000 బహుమతి!

నాగ్ పూర్ః  తప్పిపోయిన పులి ఆచూకీ తెలియాలంటూ  ఇప్పటికే జనం పూజలు చేస్తుండగా.. మహరాష్ట్ర ప్రభుత్వం జై.. ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. ఉమ్ రెడ్-కర్హండా అభయారణ్యం నుంచి తప్పిపోయిన ప్రముఖ పులి జై.. ఆచూకీ కోసం ఇప్పటికే  ప్రభుత్వం.. అటవీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ప్రకటనలు ఇవ్వగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రివార్డు ప్రకటించింది.

నాగ్ పూర్ అభయారణ్యం నుంచి ఈ యేడాది ఏప్రిల్ 18న ఏడేళ్ళ  వయసున్న భారీకాయం గల పెద్దపులి జై.. తప్పిపోయిన నాటినుంచీ దాని సమాచారం కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు జరుతుతూనే ఉన్నాయి. పులి ఆచూకీ, అడుగుజాడలు, అది సంచరించే ప్రదేశం వంటి వివరాలు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని, తెలిపినవారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని అందిస్తామని కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (సీఎల్ఏడబ్ల్యూ) స్వచ్ఛంద సంస్థ ఇప్పటికే ప్రకటించగా... తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో 50 వేల బహుమానాన్ని ప్రకటించింది. అటవీశాఖ శుక్రవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ టైగర్స్ డే' సందర్భంగా  అడవి నుంచీ తప్పిపోయిన పులి ఎప్పటికైనా తిరిగివస్తుందంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దాని సమాచారం కోసం అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని ఆయన తెలిపారు. పెద్దపులి ఆచూకీకోసం ప్రజలు పడుతున్న తాపత్రయానికి ఆనందం వ్యక్తం చేశారు.

ఒకప్పుడు నాగ్ జీరా టైగర్ రిజర్వ్ నుంచి ఉమ్రెడ్ కర్హండ్లా అభయారణ్యానికి వలస వచ్చిన జై.. అప్పట్నుంచీ స్థానికులు, పర్యటకుల అభిమానాన్ని అమితంగా చూరగొంది. రాచరికాన్ని ప్రదర్శించే జీవన విధానం, భారీ శరీరాకృతి కలిగిన జై... పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పులి జాతిలోనే విభిన్నంగా కనిపించే జై.. సుమారు 250 కేజీల బరువుంటుంది. ఇప్పటికే స్థానికులు జై.. ఆచూకీకోసం ప్రార్థనలు, పూజలు చేస్తుండగా... 100 మంది వరకూ జనం, వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లు, స్వచ్ఛందంగా గాలిస్తున్నారు. వన్యప్రాణుల పర్యవేక్షకులు, ఎన్జీవోలు కూడా జై.. ఆచూకీకోసం ప్రయత్నించాలని అటవీ అధికారులు సైతం కోరారు. శాంక్చరీ టోపోగ్రఫీ తెలిసిన బృందం ద్వారా కూడా పులి ఆచూకీ తెలుసుకొనేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు