జామియా వీడియో: వరుస ట్వీట్లు!

17 Feb, 2020 09:20 IST|Sakshi
అమిత్‌ మాలవీయ షేర్‌ చేసిన వీడియోలోని దృశ్యాలు

హోం మంత్రి, ఢిల్లీ పోలీసులపై ప్రియాంక విమర్శలు

విద్యార్థులను తప్పుబట్టిన అమిత్‌ మాలవీయ

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా గళమెత్తిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీకి సంబంధించిన వీడియో.. కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీల మధ్య ట్విటర్‌ వార్‌కు తెరతీసింది. సీఏఏను నిరసిస్తూ రెండు నెలల క్రితం ఆందోళనకు దిగిన యూనివర్సీటీ విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోపై.. ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు.

‘‘చదువుకుంటున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు ఎలా విరుచుకుపడ్డారో చూడండి! తాను చదువుకుంటున్నానని.. ఓ విద్యార్థి పుస్తకం చూపిస్తున్నా.. పోలీసులు లాఠీతో చితకబాదుతున్నారు. కానీ హోం మంత్రి, ఢిల్లీ పోలీసులు మాత్రం తాము లైబ్రరీలోకి ప్రవేశించి విద్యార్థులను కొట్టలేదని చెబుతున్నారు. అయితే ఈ వీడియోతో వారు ఎంత నిజాయితీపరులో దేశం మొత్తం తెలిసిపోయింది’’ అని ప్రియాంక ట్విటర్‌లో సదరు వీడియోను షేర్‌ చేశారు.(సీఏఏపై వెనక్కి వెళ్లం: ప్రధాని మోదీ)

ఇందుకు ప్రతిగా బీజేపీ ఐటీ సెల్‌ ఇంచార్జ్‌ అమిత్‌ మాలవీయ సైతం ఈ వీడియోను షేర్‌ చేసి.. వరుస ట్వీట్లు చేశారు. ‘‘ లైబ్రరీలో మాస్కులతో విద్యార్థులు.. మూసి ఉన్న పుస్తకాలు చదువుతున్నారు.. చదువులో నిమగ్నం కాకుండా ఆతురతగా ప్రవేశద్వారం వైపే చూస్తున్నారు.. లైబ్రరీ అంటే ఇలాగే ఉంటుందా... పోలీసులపై రాళ్లు రువ్విన తర్వాత జామియా ఆందోళనకారులు లైబ్రరీలో దాక్కున్నారు. ఈ వీడియోతో వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు. దీని ఆధారంగా అల్లరిమూకను పోలీసులు గుర్తించవచ్చు’’ అంటూ పోలీసుల చర్యను సమర్థించారు.

కాగా ఈ వీడియోను తొలుత విడుదల చేసిన జామియా సమనన్వయ కమిటీ అమిత్‌ మాలవీయ వ్యాఖ్యలను తప్పుబట్టింది. టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తున్న కారణంగా విద్యార్థులు ముఖాలకు మాస్కులు ధరించారని పేర్కొంది. వాళ్ల చేతుల్లో రాళ్లు లేవని... వారు ఎటువంటి నినాదాలు చేయడం లేదన్న విషయం స్పష్టమవుతోందని తెలిపింది. ఇక సీఏఏను వ్యతిరేకిస్తున్న క్రమంలో తాము ఎటువంటి హింసకు పాల్పడలేదని పలువురు విద్యార్థులు ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే.(జామియాలో దాడి; కీలక వీడియో విడుదల)

>
మరిన్ని వార్తలు