విభేదాలు వీడి కలిసి పనిచేద్దాం

16 Jun, 2020 05:10 IST|Sakshi

కరోనా మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడుదాం

ఢిల్లీలోని రాజకీయ పార్టీలకు అమిత్‌ షా పిలుపు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తుండడంతో రాజకీయ పార్టీలన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను వీడి, ఈ మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం పార్టీలకు అతీతంగా అందరూ చేతులు కలపాలని అన్నారు. రాజకీయ ఐకమత్యంతోనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, తద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.  ఆయన సోమవారం అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు.

ఈ భేటీకి బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ నేతలు హాజరయ్యారు. ఢిల్లీలో కరోనా నియంత్రణ చర్యలు పక్కాగా అమలయ్యేలా అన్ని పార్టీల కార్యకర్తలు కృషి చెయ్యాలని చెప్పారు. ఈ విషయంలో ఆయా పార్టీల నాయకత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఢిల్లీలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, అధికారులతో ఆదివారం జరిగిన సంప్రదింపుల సారాంశాన్ని అమిత్‌ షా అఖిలపక్ష నేతలకు తెలియజేశారు.  

అమిత్‌ షా సూచన పాటిద్దాం..  
ఢిల్లీలో కరోనా వైరస్‌ను నియంత్రించే విషయంలో కేంద్ర హోంశాఖ అమిత్‌షా చేసిన సూచనను తప్పక పాటించాలని అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), ప్రతిపక్ష బీజేపీ నిర్ణయించుకున్నాయి. ఇకపై కరోనాపై కలిసికట్టుగా పోరాటం సాగించాలని తీర్మానించుకున్నాయి. అమిత్‌ షాతో భేటీ అనంతరం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని ఆదేశ్‌ గుప్తా అన్నారు.

>
మరిన్ని వార్తలు