ఢిల్లీ ప్రజలందరికీ కరోనా పరీక్షలు: అమిత్‌ షా

15 Jun, 2020 14:16 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలందరికీ కరోనా వైరస్‌(కోవిడ్‌‌-19) నిర్దారణ పరీక్షలు నిర్వహించే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ సోమవారం తెలిపారు. ఢిల్లీతో పాటు రాజధాని ప్రాంతం(ఢిల్లీతో సరిహద్దు కలిగిన ఉత్తర ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు)లో కూడా ప్రతీ ఒక్కరికీ టెస్టులు చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.  ఢిల్లీలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం నాటికి అక్కడ 41, 182 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1327 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అమిత్‌ షా సోమవారం నార్త్‌ బ్లాక్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ అధికార పక్షం ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌, బహుజన్‌సమాజ్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా..  ప్రజల్లో కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోందని.. రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లందరికీ టెస్టులు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అదే విధంగా కరోనా బాధిత కుటుంబానికి, కంటైన్మెంట్‌ ఏరియాలో నివసిస్తున్న కుటుంబాలకు రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అలాగే మెడిసిన్‌ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులను నాన్‌ పర్మినెంట్‌ రెసిడెంట్‌ డాక్టర్లుగా గుర్తించి సేవలు వాడుకోవాలని సూచించింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్‌ షా.. కరోనా విజృంభణ నేపథ్యంలో రోజుకు 18 వేల మందికి చొప్పున కరోనా పరీక్షలు చేయించనున్నట్లు వెల్లడించారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) అనిల్‌ బైజాల్, ‌కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులతో ఆదివారం సమావేశమైన అమిత్‌ షా కరోనాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపిన విషయం విదితమే. (మహమ్మారిపై పోరు బాట)

మరిన్ని వార్తలు