ఎంపీగా ప్రమాణం తప్పిన అమిత్‌ షా

17 Nov, 2018 14:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నించడమంటే అయ్యప్ప భక్తులను అణచివేయడమేనని, అలా చేస్తే కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. మూడు రోజుల క్రితం ‘టైమ్స్‌ నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే హెచ్చరిక చేశారు. అయ్యప్ప ఆలయానికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును పినరయి విజయన్‌ ప్రభుత్వం అమలు చేయాలనుకోవడం కూడా రాజకీయమేనని ఆయన ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

ఎవరిది రాజకీయం?
ఇక్కడ ఎవరిది నిజంగా రాజకీయం? అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఓ ప్రభుత్వం విధిగా అమలు చేయాలనుకోవడం రాజకీయమా ? ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా అడ్డుకోవడం రాజకీయమా? లేదా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయవద్దని, అలా చేస్తే కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని బెదిరించడం రాజకీయమా? సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయరాదని ఓ పాలక పక్ష పార్టీ అధ్యక్షుడు సూచించడం స్వతంత్య్ర భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ విషయంలో ఆయన కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లే. తన ఉత్తర్వులను ధిక్కరించడమంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనంటూ సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చినందున, ఆయన రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. తద్వారా అన్ని విధాల దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానంటూ ఓ పార్లమెంట్‌ సభ్యుడిగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లే.

ప్రాథమిక హక్కుల విషయంలో వర్తించదు..
మత విశ్వాసాలకు సంబంధించి భారత రాజ్యాంగంలోని అధికరణ (25)1 కింద స్త్రీ, పురుషులకు సమాన హక్కులు వర్తిస్తాయి గనుక, లింగ వివక్ష చూపడానికి వీల్లేదని అయ్యప్ప ఆలయం విషయంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆలయంలోకి అన్ని వయస్కుల మగవాళ్లను అనుమతించినప్పుడు అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ ఉత్తర్వులను సమీక్షించాల్సిందిగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అది వేరే విషయం. భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేసే ఓ పార్లమెంట్‌ సభ్యుడిగా సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్వర్వుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రశ్నించే హక్కు అమిత్‌ షాకు ఉన్న మాట వాస్తవమే. అయితే పౌరుల ప్రాథమిక హక్కుల విషయంలో మాత్రం అది వర్తించదు. రాజ్యాంగంలోని (13)2 అధికరణ కింద ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత పూర్తిగా ఉన్నత న్యాయస్థానందేనని రాజ్యాంగంలోని 32 అధికరణ స్పష్టం చేస్తోంది. కనుక అయ్యప్ప ఆలయం విషయంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులను ప్రశ్నించే అధికారం ఓ ఎంపీగా అమిత్‌ షాకు లేకుండా పోయింది. పైగా ఆయన ఎంపీగా చేసిన ప్రమాణాన్ని ఇక్కడ అక్షరాల ఉల్లంఘించారు.

ఈ రెండు తీర్పులను ఓసారి పరిశీలిస్తే..
‘దేశ సమగ్రత, సార్వభౌమాధికారాలను పరిరక్షించేందుకు భారత రాజ్యాంగానికి మనస్ఫూర్తిగా కట్టుబడి ఉంటాను. అందుకు అనుగుణంగానే నా విధులను నిర్వర్తిస్తాను’ అని అందరితోపాటు అమిత్‌ షా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ‘రాజ్యాంగంలోని 141వ అధికరణ కింద సుప్రీం కోర్టు ఇచ్చే ఉత్తర్వులే ఈ దేశంలో చట్టం. ఈ చట్టాన్ని విసర్జించడానికి వీల్లేదు. ఏ ప్రభుత్వ యంత్రాంగంగానీ లేదా కోర్టుగానీ ప్రశ్నించడానికి వీల్లేదు’ అని ఒడిశా ప్రభుత్వానికి, ధనిరామ్‌ లూథర్‌ మధ్య నడిచిన వివాదంలో 2004, ఫిబ్రవరి నాలుగవ తేదీన సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఉన్నత కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని దల్బీర్‌ సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ ప్రభుత్వం మధ్య నడిచిన కేసులో సుప్రీం కోర్టు 1979లోనే తీర్పు చెప్పింది. ఈ రెండు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే అమిత్‌ షా రాజ్యాంగాన్ని అక్షరాల ఉల్లంఘించినట్లే. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి రాజ్యాంగం ప్రకారం ఎంపీగా కొనసాగడానికి వీల్లేదు.

మరి దేశంలో ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన సందర్భాలు లేవా? అంటే ఉన్నాయి. బాబ్రీ మసీదు వద్ద యథాతధ స్థితి కొనసాగించాల్సిందిగా 1989లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యూపీ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఫలితంగా 1992లో బాబ్రి విధ్వంసం జరిగింది. రాజ్యాంగ విధులను నిర్వర్తించలేకపోయినందున నాటి యూపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. వివాదాస్పద ‘పద్మావతి’ బాలివుడ్‌ చిత్రం విడుదలకు తగిన భద్రతను ఏర్పాటు చేయాలని, అందుకు వీలుగా ఆందోళనకారులను అరెస్ట్‌ చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం తొలుత తిరస్కరించింది. తర్వాత ‘పద్మావత్‌’గా పేరు మార్చాక సినిమా విడుదలకు భద్రత కల్పించింది.

మరిన్ని వార్తలు