‘కన్నడిగులు అబద్ధాలు నమ్మరు’

31 Mar, 2018 16:11 IST|Sakshi
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య , బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా

సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మధ్య వాగ్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మైసూరులో పర్యటిస్తున్న అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘మే నెలలో సిద్ధరామయ్య, జేడీఎస్‌లకు గట్టి షాక్‌ తగులుతుందం’టూ వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా గుజరాత్‌లో రాజ్‌పుత్‌ వర్గీయులు దళిత యువకుడు ప్రదీప్‌ రాథోడ్‌ను హత్య చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సిద్ధరామయ్య ట్విటర్‌ వేదికగా బీజేపీ చీఫ్‌పై విమర్శలు గుప్పించారు. ‘సొంత రాష్ట్రంలోనే దళితుల పట్ల అమానుష చర్యలు జరుగుతాయి. కానీ ఆ రాష్ట్రానికి చెందిన పెద్దమనిషి మరో రాష్ట్రానికి వచ్చి దళితులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వం. వారి సంక్షేమం కోసం అన్ని చర్యలు చేపడతాం అంటూ అబద్ధపు వాగ్దానాలు చేస్తారు. ఈ విషయం గురించి ఎవరైనా మాట్లాడితే వారిని కాంగ్రెస్‌ అనుకూలంగా మాట్లాడే అవివేకులు అంటూ ముద్ర వేస్తారు. కానీ కన్నడిగులు ఆ పెద్ద మనిషి అబద్ధపు వాగ్దానాలను నమ్మరు’  అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా మరణించిన బీజేపీ కార్యకర్త కుటుంబానికి  పార్టీ తరపున  రూ. 5 లక్షలు ఇస్తున్నామని చెప్పిన అమిత్‌ షా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కర్ణాటక కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దినేశ్‌ గుండు రావు ఆరోపించారు. ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన బీజేపీ.. అమిత్‌ షా ఎవరికీ డబ్బులు ఇ‍వ్వలేదని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు