జమ్మూ కశ్మీర్‌కు భారీ బహుమతి: అమిత్‌ షా

3 Oct, 2019 11:05 IST|Sakshi

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన అమిత్‌ షా

సాక్షి, న్యూఢిల్లీ :  సెమీ-హైస్పీడ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వైష్ణోదేవి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ఉదయం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో పచ్చజెండా ఊపి వందే భారత్‌ను  ప్రారంభించారు. ఈ రైలు  ఢిల్లీ–కత్రా (జమ్మూకశ్మీర్‌) మధ్య ఈ నెల 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అమిత్‌ షా ఈ సందర్భంగా రైల్వే సిబ్బందితో పాటు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను అభినందించారు. నవరాత్రి సందర్భంగా జమ్మూకశ్మీర్‌కు అందించే భారీ బహుమతి ‘వందే భారత్‌’ అని పేర్కొన్నారు. దేవి నవరాత్రుల్లో వైష్ణో దేవి  పవిత్ర దేవాలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు వందే భారత్‌ అనుకూలంగా ఉండనుందని తెలిపారు.

ఈ హైస్పీడ్‌ రైలు ఢిల్లీ–కత్రా మధ్య ప్రస్తుతమున్న 12 గంటల ప్రయాణ సమయాన్ని ఎనిమిది గంటలకు తగ్గించనుంది. ఈ రైలులో న్యూఢిల్లీ నుంచి ఆఖరి స్టేషన్‌ అయిన శ్రీ వైష్ణో దేవి కత్రా వరకు ప్రయాణించడానికి కనీస చార్జీలు రూ.1,630 కాగా, గరిష్టంగా రూ.3,015గా నిర్ణయించారు. మంగళవారం తప్ప వారంలో అన్ని రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది.

ట్రైన్‌ నెం: 22439 న్యూఢిల్లీ–కత్రా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి, అంబాలా కంత్, లుథియానా, జమ్మూ తావి స్టేషన్ల మీదగా కత్రాకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. కాగా ఇప్పటికే భారత్‌ మొదటి సెమీ హై స్పీడ్‌ రైలు వందే భారత్‌ ఢిల్లీ-వారణాసీ మధ్య నడుస్తోంది. కాగా ఈ రైలు విజయవంతంగా నడుస్తుండటంతో ఇటీవలే భారత రైల్వే మరో 40 నూతన వందే-భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా