దళపతి అమిత్ షా

10 Jul, 2014 02:21 IST|Sakshi
దళపతి అమిత్ షా
  •  బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మోడీ సన్నిహితుడు
  •  పార్లమెంటరీ బోర్డు భేటీలో ఏకగ్రీవ ఎంపిక
  •  అధ్యక్ష పదవికి రాజ్‌నాథ్ రాజీనామా
  •  ప్రధాని మోడీ సహా అగ్రనేతల అభినందనలు
  •  ఎన్నికల వ్యూహాల్లో దిట్ట: రాజ్‌నాథ్ ప్రశంస
  •  
     సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కీలక వ్యూహాలు రచించిన అమిత్ షాకు అత్యంత విలువైన బహుమతి లభించింది. ప్రధాని నరేంద్ర మోడీకి చాలా సన్నిహితంగా మెలిగే ఆయనకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పీఠం దక్కింది. అధ్యక్షుడిగా ఆయన నియామకానికి ఢిల్లీలో బుధవారం జరిగిన పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని మోడీ, అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషీ సహా కేంద్ర మంత్రులు, బోర్డు సభ్యులు అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కారీ తదితరులు హాజరయ్యారు. తొలుత అధ్యక్ష పీఠానికి రాజ్‌నాథ్ సింగ్ చేసిన రాజీనామాకు బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత.. అమిత్ షాను ఏకగ్రీవంగా ఎంపికచేసింది. మోడీ కేబినెట్‌లో మంత్రిగా ఉండడంతో, ఒక వ్యక్తి, ఒక పదవి సిద్ధాంతం మేరకు రాజ్‌నాథ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 
     
     నేటి నుంచి అమిత్ షా అధ్యక్షుడు: రాజ్‌నాథ్
     నితిన్ గడ్కారీ తర్వాత ఏడాదిన్నర కాలం పాటు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన రాజ్‌నాథ్.. తదుపరి అధ్యక్షుడిగా అమిత్‌షా పేరును ప్రకటించారు. బోర్డు సమావేశం అనంతరం అగ్రనేతలతో కలసి మీడియాతో మాట్లాడిన రాజ్‌నాథ్.. అమిత్ షా నియామకానికి పార్లమెంటరీ బోర్డు సర్వసమ్మతి తెలిపిందన్నారు. నేటి నుంచి అమిత్ షా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే శక్తి సామర్థ్యాలు షాకు ఉన్నాయని, ఎన్నికలు వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట అని ప్రశంసించారు. 
     
     యూపీలో అత్యధిక స్థానాలు సాధించిపెట్టిన ఘనత అమిత్‌కే దక్కుతుందన్నారు. ఆ తర్వాత తాను అధ్యక్ష పదవి తీసుకున్న పరిస్థితులను రాజ్‌నాథ్ వివరించారు. తర్వాత కొత్త అధ్యక్షుడు అమిత్‌షాను ప్రధాని మోడీ, రాజ్‌నాథ్, అద్వానీ, సుష్మా, జైట్లీ, వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, మురళీధర్‌రావుతో పాటు ఇతర సీనియర్ నేతలు అభినందించారు. తర్వాత ట్విట్టర్‌లో తన అనుచరుడికి మోడీ అభినందనలు తెలిపారు. ఆయన నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
     
     చరిత్ర సృష్టించిన వ్యూహకర్త..
     లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన అమిత్‌షా.. 50 ఏళ్లకే బీజేపీ అగ్రాసనాన్ని అధిరోహించి ఆ ఘనత సాధించిన చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. గుజరాత్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఈ మాజీ మంత్రి.. అతి తక్కువ సమయంలోనే పార్టీ ప్రథమ స్థానానికి ఎగబాకారు. యూపీలో పొత్తులు పెట్టుకోవడంలో, బీహార్లో రామ్‌విలాస్ పాశ్వాన్‌ను ఎన్డీఏలోకి తిరిగి రప్పించడంలో అమిత్ కృషి ఎంతో ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పన్నిన వ్యూహాలతో ఉత్తరాదిలో పార్టీకి ఎదురులేకుండా పోయింది. అయితే ఈ అపర చాణక్యుడిని గతం వెంటాడుతూనే ఉంది. సోహ్రబుద్దీన్, తులసీ ప్రజాపతి నకిలీ ఎన్‌కౌంటర్ల కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. 2010లో ఆయన సబర్మతి జైలులో మూడు నెలల గడిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా యూపీలో ఆయన చేసిన విద్వేష పూరిత వ్యాఖ్యలపై కేసు నమోదైంది. 
     
     ప్రస్థానం ఇలా.. 
     ముంబైలో 1964లో పుట్టిన అమిత్‌షా.. చిన్నతనంలోనే ఆరెస్సెస్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. అహ్మదాబాద్ కాలేజీలో చదువుతున్నపుడు ఆ సంఘంలో కార్యకర్తగా పనిచేశారు. 1982లో మోడీని తొలిసారి కలిశారు. 1983లో ఏబీవీపీ కార్యకర్తగా పనిచేసిన ఆయన 1986లో బీజేపీలో చేరారు. తర్వాత తన చాతుర్యంతో పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1997 నుంచి 2007 మధ్య నాలుగు పర్యాయాలు గుజరాత్‌లోని సర్కేజ్ నియోజకవర్గం నుంచి, 2012లో నరన్‌పురా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుజరాత్ కేబినెట్లో హోం మంత్రి సహా పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. బీఎస్‌సీ బయోకెమిస్ట్రీ చదివిన ఆయన కొంతకాలం తన తండ్రికి చెందిన పీవీసీ పైపుల వ్యాపార బాధ్యతలు చూసుకున్నారు. 
     
     పరిమితమైన ప్రతిభ వల్లే: కాంగ్రెస్
     బీజేపీ అధ్యక్షపీఠానికి అమిత్ పేరు ప్రకటించడంపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. ఆ పార్టీలో పరిమితమైన ప్రతిభ మాత్రమే ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేసింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఉన్నత పీఠంపై కూర్చో పెట్టడాన్ని దేశం మొత్తం విస్తుపోయి చూస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోవడానికి ఇష్టం లేకపోయినా.. ఇలాంటి నియామకంపై స్పందించక తప్పడంలేదన్నారు. దీనిపై స్పందించిన బీజేపీ ప్రతినిధి శ్రీకాంత్ శర్మ.. అమిత్‌పై కాంగ్రెస్ అక్రమంగా కేసులు బనాయించిందని, అవి కోర్టులో నిరూపితం కావన్నారు. 
     
     బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ‘బ్యాగు’ కలకలం
     ఇక్కడి అశోకారోడ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉదయం 8 గంటల సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ బ్యాగు కలకలం రేపింది. 11 గంటలకు జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశానికి అగ్రనేతలు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేసి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రమాదకర వస్తువులు లేవని నిర్ధారించారు. బీజేపీ కార్యకర్తలైన ఓ దంపతలు  బ్యాగును వదిలి ఏపీభవన్‌కు భోజనాలకు వెళ్లారని ప్రాథమిక విచారణలో తేలింది.
     
     ప్రస్థానం ఇలా.. 
     ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడిగా.. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ రావడానికి కారణమైన వ్యూహకర్తగా.. యూపీలో బీజేపీకి 71 స్థానాలు సంపాదించిపెట్టిన అపర చాణుక్యుడిగా పేరుగాంచిన అమిత్ షా కూడా బీజేపీ అగ్రనేతల వలె మొదట ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ప్రభావితుడైన వాడే. 1964లో ముంబైలోని ఒక సంపన్న కుటుంబంలో షా జన్మించారు. ఆయన తండ్రికి పీవీసీ పైపుల వ్యాపారం ఉండేది. పాఠశాల విద్యను మెహసానలో చదివిన అమిత్ షా బాల్యంలోనే ఆర్‌ఎస్‌ఎస్ శాఖా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అనంతరం డిగ్రీ చేసేందుకు అహ్మదాబాద్ వెళ్లినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌లో స్వయంసేవక్‌గా మారారు. ఆ సమయంలోనే(1982లో) నరేంద్రమోడీ పరిచయం కావడం అమిత్ షా రాజకీయ జీవితాన్ని ఒక మలుపు తిప్పింది.
     
      అప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా మోడీ నగరంలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండేవారు. అనంతరం అహ్మదాబాద్‌లోని సీయూ షా సైన్స్ కాలేజీలో అమిత్ షా బీఎస్సీ(బయోకెమిస్ట్రీ) పూర్తి చేశారు. 1983లో బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో చేరారు. అనంతరం 1986లో బీజేపీలో చేరారు. మోడీ కన్నా ఒక సంవత్సరం ముందే అమిత్ షా బీజేపీలో చేరడంతో పార్టీలో మోడీ కన్నా సీనియర్ అని చెప్పొచ్చు. 1987 నుంచి బీజేపీ యువ విభాగం బీజేవైఎంలో పనిచేయడం ప్రారంభించారు. 
     
     అందులో వార్డ్ కార్యదర్శి నుంచి ప్రధాన కార్యదర్శి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేసిన ఎల్‌కే అద్వానీ తరఫున ప్రచారం చేశారు. 1995 నుంచి మోడీ, అమిత్‌ల మ్యాజిక్ ప్రారంభమైంది. అప్పుడు గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. దాంతో గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను తీసుకున్న మోడీ, అమిత్‌షాలు ఆ పనిని దిగ్విజయంగా పూర్తిచేశారు. ప్రతీ గ్రామంలోని రెండో ప్రభావశీల నాయకుడిని బీజేపీలో చేర్చడం ద్వారా తరువాత జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో  బీజేపీ ఘనవిజయం సాధించేలా చేశారు.
     
     1999లో అమిత్ షా భారత్‌లోనే అతి పెద్దదైన అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో పటేల్, క్షత్రియ వర్గాలను ఎదుర్కొని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నష్టాల్లో ఉన్న ఆ బ్యాంకును ఒక్క ఏడాదిలోనే విజయపథంలో నిలిపారు. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ)కు ఉపాధ్యక్షుడయ్యారు. అప్పుడు జీసీఏకు మోడీ అధ్యక్షుడిగా ఉండేవారు. 1995 -2001 మధ్య మోడీ ఢిల్లీ ప్రధానకార్యాలయంలో విధుల్లో ఉన్నప్పుడు గుజరాత్‌లో నమ్మకమైన సహచరుడిగా అమిత్‌షా మోడీ కోసం పనిచేశారు. 1997లో సర్ఖేజ్ ఉప ఎన్నికలో విజయం సాధించి మొదటిసారి ఎమ్మెల్యే అయిన అమిత్‌షా.. అప్పటి నుంచి 2012 వరకు అప్రతిహత విజయాలు సాధించారు.  2002లో మోడీ ప్రభుత్వంలో అత్యంత చిన్న వయస్కుడైన మంత్రిగా రికార్డు సృష్టించారు. ఒక సమయంలో హోం శాఖ సహా దాదాపు 12 మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వహించారు. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో రాకముందు తండ్రికి చెందిన పీవీసీ పైపుల వ్యాపారాన్ని కూడా అమిత్ షా కొన్నాళ్లు నిర్వహించారు.
మరిన్ని వార్తలు