పార్టీ శ్రేణులకు అమిత్‌ షా దిశానిర్దేశం

11 Jan, 2019 17:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ శ్రేణులకు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా దిశానిర్దేశం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు తలపడుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో యువత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను దేశం నలుచెరుగులా తీసుకువెళ్లాలని పార్టీ యంత్రాంగానికి అమిత్‌ షా సూచించారు.

అభివృద్ధి, సంక్షేమానికి పాలక బీజేపీ పాటుపడుతుంటే, కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతోందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గతంలో బీజేపీ ఉనికి లేని రాష్ట్రాల్లోనూ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న మహాకూటమిపై అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. గతంలో ఒకరినొకరు చూసుకునేందుకూ ఇష్టపడని పార్టీలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచి పనులను సహించలేని పార్టీలు ఆయనను ఓడించేందుకే సిద్ధాంతాలు పక్కనపెట్టి ఒక్కటవుతున్నాయని ఆరోపించారు. మోదీ ఓటమే వారి ఏకైక అజెండాగా మారిందని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు