అర్షద్‌ కుటుంబాన్ని పరామర్శించిన అమిత్‌ షా

27 Jun, 2019 13:05 IST|Sakshi

శ్రీనగర్‌ : కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమిత్‌ షా తొలిసారి జమ్ము కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన పోలీసు అధికారి అర్షద్‌ అహ్మద్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులను ఆయన గురువారం పరామర్శించారు. అనంతనాగ్‌లో ఈ నెల 12న పారామిలటరీ బలగాలపై ఉగ్రవాదులు  దాడిచేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో వీరమరణం పొందిన అర్షద్‌ కుటుంబం నగరంలోని బాల్‌గార్డెన్‌ ప్రాంతంలో నివాసం ఉంటోంది.

ఈ క్రమంలో అమిత్‌ షా అర్షద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశ రక్షణ కోసం అర్షద్‌ చేసిన త్యాగం ఎంతోమంది జీవితాలను కాపాడింది. అర్షద్‌ ఖాన్‌ ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోంది’ అన్నారు. అర్షద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అర్షద్‌ ఖాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలిద్దరూ చాలా చిన్నవారు. వీరిలో ఒకరికి నాలుగేళ్లు కాగా మరొకరు ఏడాది నిండిన చిన్నారి.

జమ్ముకశ్మీర్‌లో జూన్‌ 12న భద్రతాబలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో అర్షద్‌ కుడా ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన అర్షద్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

మరిన్ని వార్తలు