లాక్‌డౌన్‌ 4.0: అమిత్‌ షా కీలక భేటీ

16 May, 2020 08:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన మూడో విడత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో మోదీ సర్కార్‌ తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ 4.0 ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో శని, ఆదివారాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శుక్రవారం రాత్రి హోంశాఖా అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. నాలుగో విడత లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు, ఆంక్షల నుంచి సడలింపులు, ఆర్థిక కార్యక్రమాలకు పచ్చ జెండా ఊపడం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. (79% కేసులు 30 మున్సిపాల్టీల్లోనే..)

అయితే లాక్‌డౌన్‌ మార్గదర్శకాల రూపకల్పలో కొంతమేర తర్జనభర్జన ఉందని, ఏయే ప్రాంతాల్లో పూర్తిగా సడలింపు ఇవ్వాలన్న అంశంపై అత్యున్నత స్థాయి అధికారులు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. అమిత్‌ షా సూచనల మేరకు శనివారంలోపు లాక్‌డౌన్‌పై పూర్తి నివేదికను తయారు చేస్తామని చెప్పారు. ఇక తాజా మార్గదర్శకాలపై కేంద్ర హోంశాఖ‌ కార్యదర్శి అజయ్‌ భల్లా మాట్లాడుతూ.. రాష్ట్రాల సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకుందని, జోన్ల కేటాయింపులు, మార్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. (లాక్‌డౌన్‌ 4.0లో మరిన్ని సడలింపులు!)

మరోవైపు దేశీయ విమాన సర్వీసులను కూడా నడపాలని  విమానయానశాఖ అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, దీనికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిసింది. మరోవైపు లాక్‌డౌన్‌ 4.0లో మరిన్ని సడలింపులు ఇవ్వాలని మెజార్టీ రాష్ట్రాలు కోరుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు వీలుగా ఆంక్షల సడలింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కేంద్రం కొన్ని కఠిన నిబంధనలను సడలించాలని యోచిస్తోందని తెలుస్తోంది. కాగా తెలంగాణలో లాక్‌డౌన్‌ మే 31 వరకు కొనసాగుతుండగా, మహారాష్ట్ర కూడా అదేబాటలో నడిచింది.

మరిన్ని వార్తలు