వారికి 9 మంది ప్రధానులు

23 Jan, 2019 03:35 IST|Sakshi

విపక్షాల ‘మహాగట్‌బంధన్‌’పై అమిత్‌ షా విసుర్లు 

మాల్డా: బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ప్రతిపాదిస్తున్న ‘మహాగట్‌బంధన్‌’ అధికారం కోసం అర్రులుచాస్తున్న దురాశపూరిత కూటమి అని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు. ఆ కూటమికి 9 మంది ప్రధాన మంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. 20–25 మంది నాయకుల్ని ఒక వేదికపైకి తీసుకురావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లోని మాల్డాలో మంగళవారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న అమిత్‌ షా  ‘గణతంత్ర బచావో యాత్ర’ పేరిట బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

పౌరసత్వ బిల్లుకు చట్టరూపం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్న షా.. దీనికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మద్దతు తెలుపుతారో? లేదో? అన్నారు. ‘వ్యక్తిగత ప్రయోజనాల రక్షణ, అధికారం చేపట్టాలనే దురాశతో విపక్షాలు మహాకూటమిగా ఏర్పడాలని ప్రయత్నిస్తున్నాయి. వారు మోదీని అధికారం నుంచి దించేయాలని చూస్తుంటే..మనం అవినీతి, పేదరికాన్ని నిర్మూలించాలని అనుకుంటున్నాం. దేశ ప్రజలంతా మోదీ పక్షానే ఉన్నారు. హంతకులతో అంటకాగుతున్న తృణమూల్‌ను వచ్చే ఎన్నికల్లో సాగనంపుతాం’ అని అమిత్‌షా పేర్కొన్నారు. సిండికేట్‌ పన్ను వసూలు చేస్తున్నారన్న ఆరోపణలను  షా వెనక్కి తీసుకోకుంటే పరువునష్టం దావా వేస్తామని తృణమూల్‌ హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు