ఇదంతా మోదీ ఘనతే..

17 Sep, 2019 14:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ 50 కీలక నిర్ణయాలతో దేశ గతిని మార్చివేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రశంసించారు. గత యూపీఏ హయాంలో రోజూ అవినీతి వార్తలు గుప్పుమనేవని, దేశ సరిహద్దుల్లో అభద్రత రాజ్యమేలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ప్రతి మంత్రీ తానే ప్రధానిగా భావించేవాళ్లని ఎద్దేవా చేశారు. ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) కార్యక్రమంలో అమిత్‌ షా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎన్నడూ ఓటుబ్యాంక్‌ రాజకీయాలతో నిర్ణయాలు తీసుకోలేదని సామాన్యుల సంక్షేమం కోసం పనిచేస్తారని చెప్పుకొచ్చారు. మోదీ హయాంలో జరిగిన మెరుపు దాడులను ప్రస్తావిస్తూ వీటిని ప్రజలు స్వాగతించారని, అయితే ఈ నిర్ణయాలు తీసుకునేందుకు సాహసం అవసరమన్న సంగతి గుర్తెరగాలని అన్నారు. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించాలన్న పాకిస్తాన్‌ను మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతించబోదని స్పష్టం చేశారు. మోదీ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో అంతర్జాతీయ సమాజం భారత్‌ను చూసే దృష్టికోణంలో ఇప్పుడు మార్పు చోటుచేసుకుందని చెప్పారు.

మరిన్ని వార్తలు