నాకేం కాలేదు.. ఆరోగ్యంగా ఉన్నా

10 May, 2020 04:14 IST|Sakshi

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టీకరణ

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌: తాను ఎలాంటి జబ్బుతో బాధపడడం లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్‌లో హిందీ భాషలో ఒక ప్రకటన జారీ చేశారు. అమిత్‌ షా ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో వదంతులు వెల్లువెత్తుతుండడంతో ఆయన తన ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. ‘గత రెండు రోజులుగా ‘కొందరు మిత్రులు’ నా ఆరోగ్యంపై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. నాకు మరణం ప్రాప్తించాలని వారు కోరుకుంటున్నారు.

నా ఆరోగ్యంపై ఎలాంటి స్పష్టత ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాను. కానీ, లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు నా ఆరోగ్యంపై ఆందోళన చెందుతుండడంతో స్పష్టత ఇవ్వక తప్పడం లేదు. నా ఆరోగ్యంపై ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు. పుకార్లు సృష్టించిన వారికి కూడా కృతజ్ఞతలు. వారి పట్ల నాకు ఏమాత్రం ప్రతికూల భావన లేదు. వారు ఇలాంటి పనికిమాలిన వ్యవహారాలు పక్కనపెట్టి సొంత పనులు చూసుకుంటే మంచిది’ అని అమిత్‌షా పేర్కొన్నారు.

తప్పుడు ప్రచారాన్ని ఖండించిన జె.పి.నడ్డా  
అమిత్‌ షా ఆరోగ్యంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా తీవ్రంగా ఖండించారు. అమానవీయమైన ఇలాంటి ప్రచారం చేసేవారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అమిత్‌ షా ఆరోగ్యం విషయంలో సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్, రవిశంకర్‌ ప్రసాద్‌ ఖండించారు. 

షా ఆరోగ్యంపై నకిలీ ట్విట్టర్‌ ఖాతా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన నలుగురు వ్యక్తులను అహ్మదాబాద్‌ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారు ఏకంగా అమిత్‌ షా పేరిటే ట్విట్టర్‌ ఖాతా తెరవడం గమనార్హం. కేంద్ర హోంమంత్రి తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారంటూ ట్వీట్‌ చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు