లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు

9 Dec, 2019 14:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభలో సోమవారం వాడివేడి చర్చ జరిగింది. చర్చ అనంతరం పౌరసత్వ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ఓటింగ్‌ నిర్వహించారు. సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 293 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌ అనంతరం లోక్‌సభలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతకుముందు పౌరసత్వ సవరణ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లు ప్రవేశపెడితే ఇండియా ఇజ్రాయిల్‌గా మారుతుందని ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను హిట్లర్‌తో పోలుస్తూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

ఇక బిల్లును వ్యతిరేకించాలని టీఆర్‌ఎస్‌ తమ సభ్యులకు విప్‌ జారీ చేసింది. కాగా పౌరసత్వ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. మతం పేరుతో కాంగ్రెస్‌ దేశాన్ని విభజించిందని ఆరోపించారు. పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ముస్లింలకు ఈ బిల్లు ద్వారా పౌరసత్వం కల్పిస్తామని పేర్కొన్నారు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లో హిందువులు, సిక్కులు వివక్షను ఎదుర్కొంటున్నారని అమిత్‌ షా ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి భారత్‌కు వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం చేపట్టింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దేశ లౌకిక స్ఫూర్తికి భంగకరమని కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు