ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం

12 Aug, 2019 04:16 IST|Sakshi
‘లిజనింగ్, లెర్నింగ్‌ లీడింగ్‌’ పుస్తకం ఆవిష్కరణ అనంతరం తొలి ప్రతిని వెంకయ్యకు అందజేస్తున్న హోంమంత్రి అమిత్‌ షా

చెన్నైలో హోం మంత్రి అమిత్‌ షా

వెంకయ్య సందేశాలతో ‘లిజనింగ్‌ లెర్నింగ్‌ లీడింగ్‌’ పుస్తకావిష్కరణ

సాక్షి, చెన్నై: కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామని హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. కశ్మీర్‌ అభివృద్ధి, సంక్షేమంపై ఇక పూర్తి స్థాయిలో కేంద్రం దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి రెండేళ్ల పయనంలో సాగిన పర్యటనలు, సందేశాలు, ఉపదేశాలు, కార్యక్రమాలతో కూడిన ‘లిజనింగ్‌ లెర్నింగ్‌ లీడింగ్‌’ పుస్తకావిష్కరణ ఆదివారం చెన్నైలో జరిగింది. సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ నేతృత్వంలో రూపొందించిన ఈ పుస్తకాన్ని అమిత్‌షా ఆవిష్కరించారు. తొలి ప్రతిని వెంకయ్య అందుకున్నారు.

విద్యార్థి దశ నుంచి ఉపరాష్ట్రపతి స్థాయి వరకు వెంకయ్య చేసిన రాజకీయ, ప్రజాసేవ గురించి అమిత్‌ షా వివరించారు. ఆర్టికల్‌ 370 రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని స్పష్టం చేశారు.  వెంకయ్య ఇన్నాళ్ల తన పయనాన్ని గుర్తుచేసుకుంటూ రాజకీయంగా తప్పుకున్నా, ప్రజాసేవలో, ప్రజాపయనంలో విశ్రాంతి లేదని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు రజనీకాంత్‌.. వెంకయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గొప్ప ఆధ్యాత్మిక వాదిగా ఉన్న వెంకయ్య పొరపాటున రాజకీయాల్లోకి వచ్చేశారని చమత్కరించారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్,  సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం తదితరులు హాజరయ్యారు.
 
అమిత్‌ షాకి రజినీ ప్రశంసలు
కశ్మీర్‌ వ్యవహారం, ఆర్టికల్‌ 370 రద్దు విషయమై హోం మంత్రి అమిత్‌షాను రజినీకాంత్‌ అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్‌షా కృష్ణార్జునులని కొనియాడారు. ‘నరేంద్ర మోదీ, అమిత్‌ షా ద్వయం కృష్ణార్జునుల ద్వయం వంటిది. అయితే వీరిద్దరిలో కృష్ణుడు ఎవరో, అర్జునుడు ఎవరో మనకు తెలీదు’ అని రజినీకాంత్‌ అన్నారు. త్వరలో రాజకీయ పార్టీని స్థాపించి, 2021లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని రజినీకాంత్‌  గతంలో చెప్పడం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు