అప్పటివరకూ అమిత్‌ షానే..

13 Jun, 2019 16:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కొలువుతీరిన వెంటనే నూతన కమలదళాధిపతి ఎవరనే ఉత్కంఠ కాషాయ పార్టీలో నెలకొంది. అమిత్‌ షా స్ధానంలో పలువురి పేర్లు వినిపించినా ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి ఊసు లేదని పార్టీ అగ్రనాయత్వం స్పష్టం చేసిందని చెబుతున్నారు. రానున్న కొద్దినెలల్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చే ఏడాది ఆరంభం వరకూ అమిత్‌ షానే అధ్యక్ష హోదాలో కొనసాగుతారని బీజేపీ నాయకత్వం పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరిగే హర్యానా, జమ్ము కశ్మీర్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన తర్వాతే సారథ్య బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తారని చెబుతున్నారు. మరోవైపు అమిత్‌ షా సైతం పార్టీ కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో గురువారం పార్టీ జాతీయ కార్యవర్గ భేటీకి అమిత్‌ షా పిలుపు ఇచ్చారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, బీజేపీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు హాజరయాయరు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో సంస్ధాగత ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా పార్టీ నాయకత్వ మార్పు దిశగా కసరత్తును చేపడతారు.

మరిన్ని వార్తలు