వివాదాస్పదంగా మారిన అమిత్‌ షా వ్యాఖ్యలు

10 Oct, 2019 11:30 IST|Sakshi

చండీగఢ్‌: అస్సాంలో ఎన్‌ఆర్‌సీని విజయవంతంగా అమలు చేసిన బీజేపీ.. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అమిత్‌ షా ఎన్‌ఆర్‌సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గెంటేస్తామని తెలిపారు.

హరియాణా కథియాల్‌ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగిస్తూ.. ‘ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అది మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మెండుగా ఉంది. 2024లో మరోసారి ఓట్ల కోసం మీ ముందుకు వస్తాం. కానీ ఆ లోపే బీజేపీ ప్రభుత్వం దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని దేశం నుంచి పంపించి వేస్తుంది. దాదాపు 70 ఏళ్లుగా ఈ అక్రమ వలసదారులు మన ప్రజలకు అందుతున్న అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ.. ధైర్యంగా ఉంటున్నారు. బీజేపీ, మోదీ ప్రజలకు మాట ఇచ్చారు. ఇక మీదట ఈ అక్రమ వలసదారులు దేశంలో ఉండబోరు’ అన్నారు. అలానే ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు అమిత్‌ షా. ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 రద్దు, అక్రమ వలసదారుల గెంటివేత వంటివి దేశానికి మేలు చేసే అంశాలని.. కానీ అవి కాంగ్రెస్‌కు రుచించడం లేదని అమిత్‌ షా మండిపడ్డారు.
(చదవండి: దేశమంతటా పౌర రిజిస్టర్‌)

మరిన్ని వార్తలు