సాయం చేసినందుకు ధన్యవాదాలు‌: అమిత్‌ షా

8 Jun, 2020 18:35 IST|Sakshi

బీజేపీ కార్యకర్తలపై అమిత్‌ షా ప్రశంసలు

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంలో బీజేపీ కార్యకర్తలు వలస కార్మికులకు అండగా నిలబడటం తనకు గర్వకారణమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడంలో వారు ఎల్లప్పుడూ ముందుంటారని... కష్టకాలంలో దాదాపు 11 కోట్ల మందికి పైగా ఒంటిపూట భోజనం పెట్టి మంచి మనసు చాటుకున్నారని ప్రశంసించారు. వలస కార్మికులకు సహాయం చేసిన ప్రతీ ఒక్క కార్యకర్తకు, వారిని ముందుండి నడిపించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఒడిశా జన్‌ సంవద్‌ వర్చువల్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.(బిహార్‌ ఎన్నికల్లో మాదే గెలుపు)

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్‌ మానవత్వానికి సవాల్‌ విసురుతోంది. ప్రజల సమస్యలు అర్థం చేసుకుని.. వారికి మనం మద్దతుగా నిలబడుతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్లుగా ప్రతీ ఒక్కరు సామాజిక ఎడబాటు పాటించాలి. అయితే ఈ నిబంధన ప్రజలకు, బీజేపీ మధ్య ఎన్నటికీ దూరాన్ని పెంచలేదు’’అని చమత్కరించారు. అదే విధంగా.. మహమ్మారి ప్రబలుతున్న తరుణంలో వర్చువల్‌ ర్యాలీ నిర్వహించడం ద్వారా నడ్డాజీ ప్రపంచానికి ఒక కొత్త సంప్రదాయాన్ని పరిచయం చేశారని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. వలస కార్మికుల పట్ల బీజేపీ కార్యకర్తలు మానవత్వంతో స్పందించారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి కోసం అనేక ఏర్పాట్లు చేశాయని పేర్కొన్నారు. కరోనా కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పనితనాన్ని ప్రదర్శించాయని కొనియాడారు. కాగా ఈ కార్యక్రమంలో అమిత్‌ షాతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా పాల్గొన్నారు. (‘ఇప్పటికైనా ‍మోదీ మాట విన్నారు.. ధన్యవాదాలు’)

మరిన్ని వార్తలు