-

కోవిడ్‌-19పై మెరుగ్గా పోరాడుతున్నాం!

12 Jul, 2020 14:47 IST|Sakshi

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

గుర్‌గావ్‌ : కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్‌ మెరుగైన స్ధానంలో ఉందని హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. మహమ్మారిపై భారత్‌ దృఢంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాలు (సీఏపీఎఫ్‌) చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో అమిత్‌ షా ఆదివారం పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనా వైరస్‌పై భారత్‌ విజయవంతంగా పోరాడటాన్ని ప్రపంచం గమనిస్తోందని చెప్పారు. ప్రపంచంలోనే పెద్దసంఖ్యలో జనాభా, ఫెడరల్‌ వ్యవస్థ కలిగిన భారత్‌లో కరోనాను ఎలా కట్టడి చేస్తారన్న సందేహాలు ముందుకొచ్చాయని అన్నారు. కోవిడ్‌-19పై పోరాటంలో దేశంలో 130 కోట్ల మంది జనాభా, అన్ని రాష్ట్రాలు, వ్యక్తులు ఒక్కటిగా నిలిచారని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కోవిడ్‌-19పై పోరాడుతున్నా మన దేశంలో ప్రతిఒక్కరూ ఈ వ్యాధిపై పోరుకు చేతులు కలిపారని చెప్పారు. కరోనా వైరస్‌పై గట్టిగా పోరాడి దాన్ని ఓడించే సత్తా మనకుందని అన్నారు. ఈ పోరాటంలో భద్రతా దళాలు కీలక పాత్ర పోషించాలని హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. కోవిడ్‌-19 విధుల్లో నిమగ్నమై 31 మందికి పైగా సీఏపీఎఫ్‌ సిబ్బంది తమ ప్రాణాలు కోల్పోయారని, వీరి త్యాగం వృధా కాబోదని అన్నారు. చదవండి : ‘చైనా సరిహద్దు వివాదంపై చర్చకు సిద్ధం’

మరిన్ని వార్తలు