అమిత్‌ షా మౌనం వెనక మర్మమేమిటి?

6 Nov, 2019 14:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘శాంతి భద్రతల పరిస్థితి దెబ్బ తిన్నది’ అన్న వ్యాఖ్య మన దేశంలో ఎప్పుడూ ఏదో చోటు నుంచి వినిపిస్తూనే ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణ పేరిట రాష్ట్ర ప్రభుత్వాలను తప్పించి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడం గురించి కూడా మనం వింటుంటాం. శాంతి భద్రతల పరిరక్షణకు పాటు పడాల్సిన రెండు ముఖ్య విభాగాలైన పోలీసులు, న్యాయవాదులే వాటిని భగ్నం చేయడాన్ని ఏమనాలి? గత కొన్ని రోజులుగా ఢిల్లీ నగరంలో కొనసాగుతున్న పరిస్థితి ఇదే. ఇరు వర్గాలు పరస్పర వ్యతిరేకంగా వీధుల్లోకి కూడా వచ్చాయి.

ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు ఆవరణలో పార్కింగ్‌ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఘర్షణ, విధ్వంసానికి దారి తీసింది. అందులో 20 మంది పోలీసులు, ఎనిమిది మంది న్యాయవాదులు గాయపడడంతోపాటు రెండు డజన్ల కార్లు ధ్వంసమయ్యాయి. కోర్టు లాకప్‌ ప్రాంతంలో ఇద్దరు పోలీసులను న్యాయవాదులు కొడుతున్న దృశ్యాల వీడియో వెంటనే వైరల్‌ అవడంతో ఈ విషయం ఢిల్లీ హైకోర్టు దృష్టికి వచ్చినప్పుడు కోర్టు కూడా న్యాయవాదుల పక్షానే వ్యవహరించినట్లు కనిపిస్తోంది. న్యాయవాదులపై చర్యకు ఆదేశాలు జారీ చేసిన అధికారులందరిని తక్షణమే బదిలీ చేయాల్సిందిగా కోర్టు ఆదేశించడం సబబు కాదనిపిస్తోంది.

పైగా ఘర్షణకు సంబంధించి న్యాయవాదులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ కోర్టు వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ పర్యవసానాలపై ఢిల్లీ పోలీసు కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌గానీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాగానీ స్పందించక పోవడంతో తమకు న్యాయం చేయాలంటూ ఢిల్లీ పోలీసులు వీధుల్లోకి వచ్చారు. ఢిల్లీ పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ ముందు మంగళవారం నాడు వేలాది మంది పోలీసులు న్యాయం కోసం నిలబడడాన్ని ఏమనాలి? కోర్టు ఆవరణల్లో న్యాయవాదులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. తరచూ జరుగుతూనే ఉన్నాయి.

కోర్టు ఆవరణలో తమకు ఎదురే లేదని, చట్టాల గురించి వాదించే తమకు చట్టాలు వర్తించవనే ధోరణిలోనే న్యాయవాదులు ప్రవర్తించిన సందర్భాలు కూడా ఎక్కువే. న్యాయవాదులు ఇలా ఒక్క కోర్టుల్లోనే భావిస్తే పోలీసులు తమకు చట్టాలు వర్తించవన్నట్లు దేశవ్యాప్తంగా వ్యవహరిస్తారంటూ వారిపైనా విమర్శలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం న్యాయవాదులు కోర్టు ఆవర ణలోనే జర్నలిస్టులపై దాడికి దిగినప్పుడు అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోలేదు. ఢిల్లీ పోలీసులకే కాకుండా ఢిల్లీలో శాంతి భద్రతలకు కూడా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బాధ్యుడు. మరి సమస్యను సర్దుబాటు చేయకుండా ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నారో ఆయనకే తెలియాలి. (చదవండి: రోడ్డెక్కిన ఢిల్లీ పోలీస్‌)

>
మరిన్ని వార్తలు