అమిత్‌ షా నెక్ట్స్‌ టార్గెట్‌ వీరే..

27 Aug, 2019 16:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తాను అనుకున్నది పక్కా ప్లాన్‌తో పకడ్బందీగా అమలు చేయడంలో పేరొందిన హోంమంత్రి అమిత్‌ షా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆరెస్సెస్‌ డిమాండ్లను నెరవేర్చడంపై దృష్టి సారించారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370, 35(ఏ) రద్దుతో తన అజెండాను ఆయన ఇప్పటికే విస్పష్టంగా చాటారు. ట్రిపుల్‌ తలాక్‌ నిషేధంపైనా అమిత్‌ షా ఇదే నిబద్ధత కనబరిచారు. ఇక పలు రాష్ర్టాలను కుదిపేస్తున్న నక్సల్స్‌ సమస్యపైనా అమిత్‌ షా దృష్టిసారిస్తారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ నక్సలిజం ప్రధాన సమస్యగా ముందుకొస్తుండటం పట్ల ఆరెస్సెస్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

నక్సలిజం ఎదుర్కొనేందుకు దీటైన బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని ఆరెస్సెస్‌ కోరుతోంది. అర్బన్‌ నక్సల్స్‌ పేరును పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా బీజేపీ,ఆరెస్సెస్‌లు మావోయిస్టుల సానుభూతిపరులను లక్ష్యంగా చేసే వ్యూహానికి పదును పెట్టాయి.మరోవైపు నక్సల్‌ ప్రభావిత పది రాష్ర్టాల సీఎంలు, పోలీస్‌ ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం భేటీ అయ్యారు. ఈ ఏడాది మేలో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ర్టాధినేతలతో ఆయన జరిపిన తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం కలిగిన రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సమావేశం ఫలవంతంగా సాగిందని సమావేశానంతరం అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. నక్సల్స్‌ను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. మరోవైపు మోదీ ప్రభుత్వ సారథ్యంలో నక్సల్స్‌ చేపట్టిన హింసాత్మక ఘటనల సంఖ్య 43.4 శాతం తగ్గిందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మావోయిస్టుల ఏరివేత కోసం నక్సల్‌ ప్రభావిత జిల్లాల్లో కీలక మౌలిక సదుపాయాలు, పౌర సేవలను పెంపొందించే అభివృద్ధి ప్రణాళికలకు కేంద్ర ప్రభుత‍్వం భారీగా నిధులు కేటాయిస్తోంది.

మరిన్ని వార్తలు