దేశ అంతర్గత విషయాలను బయటపెడుతున్నారు: అమిత్‌ షా

11 Oct, 2019 19:01 IST|Sakshi

మహారాష్ట్ర: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరోసారి కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ విదేశీ వ్యవహారాల నాయకుడు కమల్‌ దాలివాల్‌ బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ ముఖ్య నాయకుడి జెరిమిన్‌ కోర్బిన్‌తో భేటీ అయ్యారని అన్నారు. అయితే, కశ్మీర్‌లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదని కమల్‌ బ్రిటిష్‌ నాయకుడికి చెప్పారని ఆరోపించారు. కమల్‌.. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి సన్నిహితుడని గుర్తు చేశారు. మరోవైపు దేశ అంతర్గత విషయాలను విదేశీ నాయకులతో చర్చించాల్సిన అవసరం ఏముందని ఆ‍యన దుయ్యబట్టారు.

అదే విధంగా మోదీ అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారి భేటీలో కశ్మీర్‌ అంశం చర్చకు రాగా, ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహిస్తానని సూచించగా,  మోదీ సున్నితంగా తిరస్కరిస్తూ తమ దేశ అంతర్గత సమస్యను పరిష్కరించుకునే సత్తా తమకుందని చెప్పిన విషయాన్ని షా ఉటంకించారు. మరోవైపు లేబర్‌ పార్టీ నాయకుడు కాంగ్రెస్‌ పార్టీతో అర్థవంతమైన చర్చలు జరిగాయని ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో కశ్మీర్‌లో మానవ హక్కుల పరిరక్షణ గురించి చర్చించామని చెప్పడం గమనార్హం​.   

మరిన్ని వార్తలు