అమ్మ సిమెంట్ బస్తా రూ.190 మాత్రమే!

6 Jan, 2015 02:55 IST|Sakshi
జయలలిత

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత  పేరుతో  తమిళనాడులో పరిచయమైన పథకాల జాబితాలో కొత్తగా అమ్మ సిమెంట్ చేరింది. 50 కిలోల సిమెంట్ బస్తా కేవలం 190 రూపాయలకే  అందేలా పథకాన్ని రూపొందించారు. తిరుచిరాపల్లిలో సోమవారం ఐదు చోట్ల సిమెంటు బస్తాల విక్రయాన్ని ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా 470 కౌంటర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తెచ్చుకున్నవారికి మాత్రమే అమ్మ సిమెంట్ విక్రయించేలా నిబంధన విధించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గత సెప్టెంబరు 26న ఈ పథకాన్ని ప్రకటించారు.

అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత పేద, మధ్య తరగతి వర్గాల్ని ఆకర్షించే విధంగా పథకాల్ని ప్రవేశపెడుతూ వస్తోంది. పేదలకు ఉచిత బియ్యం, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు, ఉచిత పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్, షూ, పాదరక్షల్ని అందిస్తున్నారు. పేద యువతుల వివాహానికి బంగారు తాళి పథకం, కుటుంబ కార్డుదారులకు మిక్సీ, గ్రైండర్లు, ఫ్యాన్ల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉచిత పథకాలు ఓ వైపు ఉంటే, మరో వైపు అమ్మ పేరిట క్యాంటీన్లు, వాటర్ బాటిళ్లు, అమ్మ సంత, కూరగాయల దుకాణాలు, ఉప్పు విక్రయాలు,  మెడికల్ షాపులు ప్రజల ముంగిటకు చేరాయి. ఇప్పుడు అమ్మ పేరిట సిమెంట్ విక్రయాలకు కూడా శ్రీకారం చుట్టారు.

 తమిళనాడులోని అనేక నగరాల్లో భవన నిర్మాణలు శరవేగంగా సాగుతున్నాయి.  రాష్ట్రంలో సిమెంట్ వినియోగం పెరగడంతో ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ధరలు పేద, మధ్య తరగతి వర్గాలకు భారంగా మారాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో సిమెంట్ విక్రయాలను మొదలుపెట్టింది.

మరిన్ని వార్తలు