అమ్మ ఇన్.. అకాలీ ఔట్?

4 Jun, 2016 09:27 IST|Sakshi
అమ్మ ఇన్.. అకాలీ ఔట్?

న్యూఢిల్లీ: ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, వచ్చే ఏడాది మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలో కొత్త పొత్తులు ఉదయించడమే కాక ఇప్పటికే కలిసున్న కొన్ని పార్టీలు విడిపోనున్నాయి. తమిళనాడులో వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేసిన అన్నాడీఎంకే.. ఎన్డీఏలో చేరబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.

అదే సమయంలో రెండు దశాబ్దాలుగా ఎడ్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్.. కూటమి నుంచి వైదొలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత లోక్ సభలో రెండో అతిపెద్ద పార్టీగా కొనసాగుతున్న అన్నాడీఎంకే మోదీ సర్కారుకు మద్దతు ఇస్తే జీఎస్టీ సహా ఇతర కీలకమైన బిల్లుల ఆమోదంలో ఎన్డీయేకు ఇక ఇబ్బందులు ఉండబోవు. ప్రధానంగా రాజ్యసభ విషయంలోనే ఎన్డీయే సర్కారు ఇబ్బందులు పడుతోంది. అక్కడ మెజారిటీ తగినంతగా లేకపోవడంతో అనేక బిల్లులు కీలకదశలో ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఆ విషయంలో కేంద్రాన్ని ఆదుకోవడం ద్వారా రాష్ట్రానికి భారీగా నిధులు సమకూర్చుకోవాలని జయలలిత భావిస్తున్నట్లు ఆమె పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అమ్మ ఎన్డీయేలో ఎందుకు చేరుతుంది?
మునుపెన్నడూ లేని విధంగా భారీగా ఉచిత పథకాల హామీతో రెండోసారి గద్దెనెక్కిన జయలలితకు వాటిని అమలు చేయాలంటే వేల కోట్ల నిధులు కావాలి. తమిళనాడు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం దాదాపు అసాధ్యం. అందుకే ఆమెకు కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. దీంతో ఎన్డీయేకు మద్దతు పలకడం జయకు తప్పనిసరి. అయితే మోదీ ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి మాత్రమే మద్దతు పలకాలని ఆమె భావిస్తున్నారు. ప్రస్తుతం ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ భారత్ కు తిరిగి వచ్చాక జూన్ మాసాంతంలో ఆయనను జయలలిత కలుసుకోనున్నారు. ఆ భేటీలోనే ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఏఐడీఎంకే వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే అన్నాడీఎంకేతో సత్సంబంధాన్ని కొనసాగిస్తోన్న ఎన్డీయే.. జయకు అత్యంత నమ్మకస్తుడైన తంబిదురైని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా నియమించింది. ప్రస్తుతం అన్నాడీఎంకు లోక్ సభలో 39 మంది ఎంపీలు, రాస్యసభలో 12 మంది సభ్యుల బలం ఉంది. తమిళనాడులో ప్రతిపక్ష కూటమిలో ఉన్న కాంగ్రెస్.. జాతీయస్థాయిలో చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకైనా జయలలిత మద్దతు పలికే అవకాశమే లేదు. దీనిని తనకు అనుకూలంగా మలచుకోవాలనే ప్రయత్నంలోనే ఆమెను ప్రభుత్వంలోకి చేర్చుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది.

రెండు దశాబ్ధాల బంధం తెగిపోనుందా?
పంజాబ్ లో 19997 నుంచి శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), బీజేపీల మధ్య స్నేహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీల కూటమే అధికారంలో ఉంది. అయితే 2017లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తాము ఒంటరిగా పోటీచేసే అవకాశం లేకపోలేదని రాజ్యసభలో అకాలీదళ్ ముఖ్యనేత, మాజీ కేంద్ర మంత్రి సుఖ్ దేవ్ ధిండ్సా శుక్రవారం విలేకరులతో అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎస్‌ఏడీ- బీజేపీ, కాంగ్రెస్ కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీ ల మధ్య త్రిముఖ పోరు జరగనుందని, తాము బీజేపీతో కలిసుంటే పోరాటంలో వెనుకబడిపోయే అవకాశం ఉందని, అందుకే ఎన్డీయే నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ధిండ్సా పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి ఆర్పీ సింగ్ మాత్రం ధిండ్సా వ్యాఖ్యలను ఖండించారు. ప్రస్తుతం అకాలీదళ్ నుంచి ఎన్నికైన హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు