తాటి, కొబ్బరి చెట్లు కూలిపోతాయి!

19 May, 2020 14:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: సూపర్ సైక్లోన్ 'అంఫన్' బీభత్సం సృష్టించే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న 'అంఫన్' తుపాను బుధవారం మధ్యాహ్నం దిఘా (పశ్చిమ బెంగాల్) మరియు హతియా దీవులు (బంగ్లాదేశ్) మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 155 నుంచి165 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. గరిష్టంగా 185 కిలోమీటర్ల వరకు భీకర గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఈ సమయంలో 'అంఫన్' బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

పూరి పాకలు, పురాతన నిర్మాణాలతో పాటు ఎగిరే వస్తువులకు ప్రమాదం ఉందని పేర్కొంది. కమ్యూనికేషన్, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయని తెలిపింది. అనేక చోట్ల రైలు, రహదారి ప్రయాణాలకు అంతరాయం కలుగుతుందని అంచనా వేసింది. నిలబడి ఉన్న పంటలు, తోటలకు విస్తృతమైన నష్టం వాటిల్లుతుందని తెలిపింది. తాటి, కొబ్బరి చెట్లు ఎక్కువగా కూలిపోయే అవకాశముందని..పెద్ద పడవలు, ఓడలు ధ్వంసం కావొచ్చని ఐఎండీ హెచ్చరించింది. 'అంఫన్' ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ముఖ్యంగా ఈదురు గాలులు వీచే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. (అంఫన్‌తో జాగ్రత్త)

బెంగాల్‌, ఒడిశా అప్రమత్తం
'అంఫన్' అతి తీవ్ర తుపానుగా మారడంతో పశ్చిమ బెంగాల్‌, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తుపాను ప్రభావిత ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలపై 'అంఫన్' ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) 37 బృందాలను బెంగాల్‌, ఒడిశాలోని తీర ప్రాంతాలకు తరలించింది. గత రెండు దశాబ్దాల కాలంలో బంగాళాఖాతంలో సూపర్‌ సైక్లోన్‌ ఏర్పడటం రెండోసారి కావడం గమనార్హం. (అతి తీవ్ర తుపానుగా అంఫన్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు