సీఎం భార్య పెళ్లికి ముందు హిందువేనా?

13 Dec, 2017 10:23 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సతీమణి అమృత ఫడ్నవిస్‌ తీరుపట్ల సోషల్‌ మీడియాలోని ఓ వర్గం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. క్రిస్‌మస్‌ దృక్పథంతో రూపొందించిన ఓ స్వచ్ఛంద సేవ కార్యక్రమాన్ని ఆమె ప్రమోట్‌ చేస్తుండటంతో కొందరు ఆమెపై సోషల్‌ మీడియాలో అక్కసు వెళ్లగక్కుతున్నారు.

ఓ ఎఫ్‌ఎం రేడియో చానెల్‌.. ‘బీ సాంటా’ పేరిట నిరుపేద పిల్లలకు కానుకలు అందించేందుకు చేపట్టిన కార్యక్రమంలో అమృత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలతో ఆమె ట్వీట్‌ చేయగా.. దీనిపై కొందరు అక్కసు వెళ్లగక్కారు. సీఎం, సీఎం సతీమణి తీరును తప్పుబడుతూ విమర్శలు చేశారు. పెళ్లికి ముందు అమృత ఫడ్నవిస్‌ అసలు హిందువునే అని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సీఎం కెరీర్‌కు అంతమంచిది కాదని కొందరు హితవు పలికారు. అమృత ఫడ్నవిస్‌ హిందూ పండుగలపై ఎక్కువగా ఫోకస్‌ చేయాలని ఇంకొందరు సూచించారు.

ఈ వివాదం ముదరడంతో దీనిపై అమృత ట్వీట్‌ చేశారు. ‘ప్రేమ, అభిమానం, సానుభూతి వంటి భావనలకు మతం ఉండదు. సానుకూలత ఎక్కడ ఉన్నా స్వీకరిద్దాం. ప్రతికూల, చెడు ఆలోచనలకు దూరం జరుగుదాం’ అని ఆమె పేర్కొన్నారు. ‘ఒక హిందువును అయినందుకు నేను గర్విస్తున్నాను. చాలామంది తరహాలోనే నేను దేశంలోని ప్రతి పండుగను జరుపుకుంటాను. మన దేశీయ స్ఫూర్తికి మనం ప్రాతినిధ్యం వహించాలి. అంతమాత్రన మన దేశం, మతం, మానవత్వం నుంచి వెనుకకు తగ్గినట్టు కాదు’ అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు