ఒక్కరోజుతో ఆరోగ్యవంతులవుతారా..?

20 Jun, 2019 16:42 IST|Sakshi

లక్నో: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దేశమంతా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటే యూపీలో మాత్రం ఇందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. యూపీలోని అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు యోగా వేడుకలను వ్యతిరేకిస్తున్నారు. ఒక్కరోజు యోగా చేసినంత మాత్రాన ప్రజలు ఆరోగ్యవంతులైపోతారా అంటూ విమర్శించారు. అలాగే అబ్బాయిలు, అమ్మాయిలకు విడివిడిగా కాకుండా ఒకే చోట యోగా చేసేలా ఏర్పాట్లు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఫైజల్‌ హస్సన్‌ మాట్లాడుతూ.. యూనివర్సిటీ యాజమాన్యం యోగా చేసేందుకు పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇస్లాంలో మేము ప్రతిరోజు 5 సార్లు నమాజ్‌ చేస్తామని, అది కూడా యోగాలాంటిదేనని అన్నారు. నిజంగా యాజమాన్యానికి అంత శ్రద్ధ ఉండుంటే యోగా తరగతులను సంవత్సరం పాటు పెట్టి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు.

ఏఎంయూ కోర్ట్‌ మెంబర్‌ షఫికుర్‌మాన్‌ ఖాన్‌  మాట్లాడుతూ .. యోగా పాఠ్యాంశాల్లో భాగమైతే దాన్ని స్వాగతిస్తామని.. ఇలా బలవంతంగా వేడుకలు జరిపితే దానికి తాము ఒప్పుకోమన్నారు. యోగా దినోత్సవానికి కూడా మతం రంగు పులమడం దురదృష్టకరమన్నారు. వర్సిటీ ప్రతినిధి షపీ కిద్వాయ్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్సిటీలో వారం రోజలుపాటు వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. యోగాడే కోసం చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకోగా లేనిది.. యోగా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ వివాదంపై ఏఎంయూ అధికారులు స్పందిస్తూ యోగా వేడుకలు ఇప్పుడు కొత్తగా జరగట్లేదని, 2015 నుంచి వేడుకలను కొనసాగిస్తున్నామని గుర్తుచేశారు. విద్యార్థులకు యోగా నిపుణులతో పాఠాలు చెప్పించడమే కాక వర్క్‌షాప్స్‌ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు