అమూల్ ఎండీకి మాఫియా డాన్ బెదిరింపు!

31 May, 2016 11:06 IST|Sakshi

అహ్మదాబాద్: అమూల్ పాలు ఈ పేరు వినే ఉంటారు కదా..! ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనే ఆ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధీకి మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవి పూజారి పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి 25 కోట్లు ఇవ్వాలని తనను డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోధీ ఫిర్యాదు మేరకు కేసును అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ కు అప్పగించినట్లు ఆనంద్ ఎస్పీ సౌరభ్ సింగ్ తెలిపారు.

తాను ఫెడరేషన్ మీటింగ్ లో ఉన్నప్పుడు తొలిసారి ఫోన్ కాల్ వచ్చినట్లు సోధీ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలర్ తనను తాను రవి పూజారిగా చెప్పి తాను ఆస్ట్రేలియాలో ఉంటానని పరిచయం చేసుకున్నారని తెలిపారు. తొలుత ఏదో వ్యాపారం పనిమీద ఫోన్ చేసి ఉంటారని భావించానని, అతడి నెంబరును మరో అధికారి మొబైల్ యాప్‌లో చెక్ చేయగా, అతను గ్యాంగ్ స్టర్ అని తెలిసినట్లు చెప్పారు. తనకు రూ. 25 కోట్లు ఇవ్వకపోతే కాల్చిపారేస్తామని బెదిరించినట్లు వివరించారు. ఈ సంస్థపై ఆధాపడి 36 లక్షల పేద కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పడానికి ప్రయత్నించానని కానీ, పూజారి అవన్నీ తనకేం పట్టవనీ డబ్బు ఇవ్వాల్సిందేనని చెప్పినట్లు తెలిపారు.

మే మొదటివారంలో సోధీకి పూజారి మరో మూడు మార్లు ఫోన్ చేసినట్లు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కే ఎన్ పటేల్ తెలిపారు. ఫోన్లన్నీ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) తో చేయడం వల్ల వ్యక్తి నంబర్‌ను కచ్చితంగా పట్టుకోలేమని వివరించారు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల నుంచి మాత్రం ఫోన్లు వచ్చినట్లు గుర్తించమన్నారు. గత ఏడాది నవంబర్, జనవరిలో పూజరి బెదిరించిన వ్యక్తుల కేసులను కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

>
మరిన్ని వార్తలు