అనకొండ ట్రైన్‌, రైల్వే శాఖ రికార్డు

1 Jul, 2020 15:41 IST|Sakshi

బిలాస్‌పూర్‌: మూడు గూడ్స్‌ రైళ్లను ఒకే ట్రైన్‌గా మార్చి భారతీయరైల్వే బుధవారం సరికొత్త  రికార్డును సృష్టించింది. బిలాస్‌పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌కు చెందిన మూడు గూడ్స్‌ రైళ్లను జతచేసి ఒకే ట్రైన్‌గా విజవంతంగా నడిపింది.  లోడుతో ఉన్న మూడు రైళ్లను జతకలిపి బిలాస్‌పుర్‌-చక్రధర్‌పూర్‌ డివిజన్ల మధ్య విజయవంతంగా నడిపినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. కొండను మింగిన కొండచిలువలాగా ఈ రైలు పట్టాలపై సాగిపోతుందని రైల్వే శాఖ అభివర్ణించింది. దీనిని అనకొండ రైలుగా పిలుస్తున్నారు. (ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్‌)

దీని గురించి భారతీయ రైల్వే శాఖ మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఎక్కువ సరుకును రవాణా చేసేందుకు మూడు రైళ్లను కలిపి ఒకే రైలుగా మార్చే ప్రయోగం చేసినట్లు వివరించింది. 15 వేల టన్నులకు పైగా సరుకుతో ఈ గ్రూడ్స్‌ రైలు ప్రయాణం చేసినట్లు వెల్లడించింది. దీన్ని  బట్టి  చూస్తే భవిష్యత్‌లో సరుకు రవాణా సమయాన్ని ఆదా చేసేందుకు మరికొన్ని పొడగాటి రైళ్లను  నడిపే యోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు కనబడుతోంది. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా విజృంభిస్తున్న క్రమంలో ప్రజా రవాణా రైళ్లను రైల్వే శాఖ పరిమితసంఖ్యలోనే నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం విధించిన అన్‌లాక్‌ 2.0 నిబంధనల ప్రకారం ప్రజా రవాణా రైళ్లను పెంచే యోచనలో కేం‍ద్రం ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.రైల్వేశాఖ ప్యాసింజర్ రైళ్ల కదలికను పరిమితం చేసినప్పటికీ గూడ్స్‌ రైలు సేవలు యథాతథంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. (రైల్వే ఇక మేడిన్‌ ఇండియా)

>
మరిన్ని వార్తలు