'జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ కోచింగ్'

28 May, 2020 09:07 IST|Sakshi

ప‌ట్నా : లాక్‌డౌన్ నేప‌థ్యంలోనూ  గాయ‌ప‌డిన త‌న తండ్రిని సొంతూరుకు చేర్చ‌డం కోసం 1200 కిలోమీట‌ర్లు సైకిల్‌పై ప్ర‌యాణించిన జ్యోతి కుమారి ప‌ట్ల స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ మ్యాథ‌మెటీషియ‌న్, సూప‌ర్ 30 వ్య‌వ‌స్థాప‌కుడు ఆనంద్ కుమార్ జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్ అందిస్తామ‌ని ప్ర‌క‌టించాడు. ''ఐదు రోజుల పాటు సైకిల్ తొక్కుతూ 1200 కిలోమీట‌ర్ల ప్ర‌యాణించ‌డం అంటే ఒక సాహ‌స‌మే. కానీ జ్యోతి కుమారి సంక‌ల్పం ఉంటే ఏదైనా సాధ్య‌మే అని నిరూపించింది. సూప‌ర్ 30 త‌ర‌పున మా త‌మ్ముడు జ్యోతి కుటుంబాన్ని క‌లిసి స‌హాయం అందించాడు. భ‌విష్య‌త్తులో ఐఐటీయ‌న్ కావాల‌నుకుంటే జ్యోతికుమారికి మా సూప‌ర్ 30 స్వాగ‌తం ప‌లుకుతుంది'' అంటూ ఆనంద్ కుమార్ ట్వీట్ చేశారు. 
(పల్లె విద్యార్థులకు ఆనంద్‌ కుమార్‌ పాఠాలు )

అంత‌కుముందు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యోతికి సైక్లింగ్‌లో శిక్ష‌ణ‌తో పాటు ఆమె చ‌దువుకు కూడా స‌హాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. జ్యోతిని ధైర్య‌వంతురాలిగా ప్ర‌శంసిస్తూ ప‌లువురు మంత్రులు ఆమెకు స‌హాయం అందివ్వ‌డానికి ముందుకు వ‌చ్చారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి సైతం జ్యోతి చ‌దువుకు, వివాహానికి అయ్యే మొత్తం ఖ‌ర్చు తానే భ‌రిస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ఆర్డేడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రికి ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక జ్యోతి సాహాసానికి ఇవాంకా ట్రంప్ సైతం ఫిదా అయ్యారు. ఆమె క‌థ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్న ఇవాంకా ''అదో అంద‌మైన స‌హ‌నంతో కూడిన ప్రేమ. ఆమె చేసిన ఫీట్‌ని భార‌త ప్ర‌జ‌ల‌తో పాటు సైక్లింగ్ ఫెడ‌రేష‌న్ గుర్తించాయి'' అంటూ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. (జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక )


 

మరిన్ని వార్తలు