‘హార్ట్‌’ టచింగ్‌ మెసేజ్‌

16 Nov, 2018 12:50 IST|Sakshi

సామాజిక మాధ్యమం ట్విటర్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర చేసిన ఓ పోస్ట్‌ గుండెకు హత్తుకునేలా ఉంది. చనిపోయిన కూతురి ఓ తండ్రి ఎంత ప్రేమను కనబరుస్తున్నాడో తెలిపే ఓ వీడియోను ట్వీట్‌ చేసిన ఆయన..‘ఈ రోజు నేను రెండు ప్రొడక్ట్స్‌ ప్రారంభించినప్పటికీ.. ఈ వీడియోను మీతో షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో ఎప్పటిదో నాకు తెలియదు.. కానీ అది నా మనసును కదిలించింది. అదే విధంగా ఆ తండ్రి కూడా తన కూతురు గుండెను కదిలించాడు. మన చర్మం ఏ రంగులో ఉన్న.. శరీరంలోని గుండె మాత్రం అందరిలో ఒకేలా కొట్టుకుంటుందనే చక్కటి సందేశం అందులో ఉంద’ని పేర్కొన్నారు.

ఆ వీడియోలో ఏముదంటే..
యూఎస్‌లోని ఒరెగాన్‌కు చెందిన బిల్‌ కన్నేర్‌కు గతేడాది తన కొడుకు ఆస్టిన్‌, కూతురు అబ్బేతో కలిసి ఫ్యామిలీ టూర్‌కు వెళ్లాడు. అక్కడ ఆస్టిన్‌, అబ్బేలు ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదం నుంచి ఆస్టిన్‌ బయటపడినప్పటికీ.. అబ్బే మరణించింది. తర్వాత బిల్‌ ఆమె అవయవాలను దానం చేశారు. అయితే తన కూతురిని మరచిపోలేకపోయిన బిల్‌.. అబ్బే జ్ఞాపకార్థంగా సైకిల్‌పై దేశవ్యాప్తంగా పర్యటించాలని అనుకున్నాడు. అలాగే అవయవ దానం గొప్పతనం గురించి చాటిచెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా అతడు అబ్బే అవయవాలు దానం చేసిన హెల్త్‌ సెంటర్‌కు వెళ్లి.. ఆమె అవయవాలు ఎవరికైతే అమర్చారో వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన విజ్ఞప్తితో హెల్త్‌ సెంటర్‌ సిబ్బంది అబ్బే అవయవాలు అమర్చిన వారిని సంప్రదించారు.

అందులో ఆమె హృదయాన్ని అమర్చిన లూమోత్‌ జాక్‌ మాత్రమే.. అబ్బే తండ్రిని కలిసేందుకు అంగీకారం తెలిపాడు. దీంతో హెల్త్‌ సెంటర్‌ నిర్వహకులు అతని వివరాలను బిల్‌కు అందజేశారు. తన యాత్రలో భాగంగా ఫాదర్స్‌డే రోజున లూమెత్‌ను కలిసిన బిల్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. స్టేతస్కోప్‌తో లూమెత్‌ గుండె(అతనికి అమర్చిన అబ్బేది) చప్పుడు విని కూతురిని గుర్తుచేసుకున్నారు. అక్కడే ఉన్న లూమెత్‌ తండ్రి బిల్‌ను ఓదార్చారు. లూమెత్‌ విషయానికి వస్తే.. 21 ఏళ్ల లూమెత్‌ గుండె బలహీనంగా ఉండటం వల్ల ఎక్కువ కాలం బ్రతకడని వైద్యులు ప్రకటించారు. ఆ సమయంలో అబ్బే గుండె అమర్చడం వల్ల లూమెత్‌కు మరో జన్మ లభించినట్టయింది.

మరిన్ని వార్తలు