విపక్షాలను కోతులతో పోల్చిన కేంద్ర మంత్రి

29 Jun, 2018 15:01 IST|Sakshi
కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే

సాక్షి, బెంగళూర్‌ : కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విపక్షాలను కోతులు, నక్కలతో ఆయన సరిపోల్చారు. కర్వార్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓ వైపు పులి, మరోవైపు కోతులు, నక్కలు బరిలో దిగుతాయని, ప్రజలు పులినే ఎంపిక చేసుకుంటారని వ్యాఖ్యానించారు. దేశం అభివృద్ధిలో వెనకబడటానికి కాంగ్రెస్‌ పార్టీయే బాధ్యత వహించాలన్నారు.

కాంగ్రెస్‌ 70 ఏళ్ల పాటు దేశాన్ని పాలించినా మనం ఇంకా ప్లాస్టిక్‌ కుర్చీల్లో కూర్చుంటున్నామని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ సుదీర్ఘ పాలనతో మీరు వెండి కుర్చీల్లో కూర్చుని ఉండాల్సిందని అన్నారు.అనంత్‌ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో ఆయన దళితులను కుక్కలతో పోల్చడం పెనుదుమారం రేపింది. తాము వీధిన వెళుతుంటే కుక్కలు మొరిగితే పట్టించుకోమని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా మంత్రి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తాను దళితులను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, పలు అంశాలపై తన వైఖరిని ఎండగడుతున్న మేథావులను ఉద్దేశించే అలా అన్నానని చెప్పుకొచ్చారు.

ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ హెగ్డే వ్యాఖ్యలు కలకలం రేపాయి. బెంగళూర్‌, మైసూర్‌ ప్రజలకు కూడా కన్నడ ఎలా మాట్లాడాలో తెలీదని వ్యాఖ్యానించారు. ఇక 2017 డిసెంబర్‌లో రానున్న రోజుల్లో బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

>
మరిన్ని వార్తలు