తెలుగు రాష్ట్రాలకు తొలి రెండు ర్యాంకులు..

10 Jul, 2018 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వ్యాపారం నిర్వహించేందుకు అనుకూల రాష్ట్రాల సరళతర వాణిజ్య (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) సూచీలో ఏపీ, తెలంగాణా తొలి రెండు ర్యాంకుల్లో నిలిచాయి. ఈ సూచీలో హర్యానా మూడవ స్ధానంలో నిలిచిందని పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2017 వెల్లడించింది. గత ఏడాది ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్ర స్ధానంలో నిలిచిన తెలంగాణ ఈ సారి రెండో స్దానంలో నిలిచింది.

సంస్కరణల ఆధారిత స్కోర్‌, ఫీడ్‌బ్యాక్‌ స్కోర్‌ను క్రోడీకరించిన అనంతరం తుది ర్యాంకులను ప్రకటించారు. కాగా జార్ఖండ్‌, తెలంగాణ రాష్ట్రాలు సం‍స్కరణల ఆధారిత స్కోర్‌ను 100 శాతం సాధించడం గమనార్హం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో జార్ఖండ్‌ నాలుగో ర్యాంక్‌లో, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ ఐదో ర్యాంక్‌లో నిలిచాయి. పలు స్టీల్‌ ప్లాంట్లు, బొగ్గు, ముడి ఇనుము గనులను కలిగిన జార్ఖండ్‌ సంస్కరణల ఆధారిత స్కోర్‌ను నూరు శాతం సాధించిందని డీఐపీపీ తెలిపింది. సంస్కరణల ఆధారిత స్కోర్‌ తక్కువగా నమోదు చేయడంతో మహారాష్ట్ర 13వ ర్యాంక్‌, తమిళనాడు 15వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ పేలవమైన సామర్థ్యం కనబరిచి ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో 23వ స్ధానం సాధించింది.

మరోవైపు వ్యాపారం నిర్వహించేందుకు అనుకూల దేశాల వార్షిక జాబితా 2017ను వరల్డ్‌ బ్యాంక్‌  ప్రకటించే ముందు రాష్ట్రాల తాజా ర్యాంకింగ్స్‌ వెలువడ్డాయి. గత ఏడాది భారత్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో తన స్ధానాన్ని మెరుగుపరుచుకుని 100వ ర్యాంక్‌కు ఎగబాకింది. అంతకుముందు ఏడాది భారత్‌ ఈ ర్యాంకింగ్స్‌లో అట్టడుగున 130వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు