సానుకూల దృక్పథంలో ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు!

28 Nov, 2014 16:02 IST|Sakshi

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న ఉద్యోగుల విభజన అంశం కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. దీనిలో భాగంగానే శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎస్ లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో సమావేశమయ్యారు. ప్రధానంగా పునర్ విభజన చట్టం వివాదాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల సీఎస్ లు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎస్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని వివాదాలపై కేంద్రాన్ని పరిష్కారం ఇవ్వమని కోరినట్లు ఆయన తెలిపారు.

 

కాగా, కమల్ నాధన్ కమిటీ కార్యకలాపాలు హైదరాబాద్ లో సాగేందుకు అనుమతి కోరినట్లు తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ తెలిపారు. విభజన చట్టంలోని అంశాలపై ఇరు రాష్ట్రాలకు వేర్వేరు అభిప్రాయాలున్నట్లు ఆయన తెలిపారు. వీటిపై కేంద్రాన్ని న్యాయ సలహా కోరామన్నారు. అందరికీ అనుకూలంగా ఉండే విధానాన్ని అనుసరించాలని ప్రత్యూష్ సిన్హాను కోరామన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సానుకూల దృక్పథంలో సాగుతున్నాయని రాజీవ్ శర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు